తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల చెల్లింపులో జరుగుతున్న భారీ అవకతవకలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది.
ఆర్థిక శాఖ ఆదేశాలు హెచ్‌ఓడీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో మొత్తం 4,93,820 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండగా.. రికార్డుల ప్రకారం కేవలం 55% (దాదాపు 2.74 లక్షలు) మంది వివరాలు మాత్రమే ప్రభుత్వ పోర్టల్‌లో నమోదయ్యాయి. గడువు ముగిసినా, మిగిలిన 45% (సుమారు 2.18 లక్షలు) మంది ఉద్యోగుల ఆధార్, బ్యాంక్ వివరాలు నమోదు కాలేదు.
దీంతో, ఇంతకాలం రికార్డుల్లో పేర్లు సృష్టించి, పనిచేయని లేదా నకిలీ ఉద్యోగుల పేర్లతో జీతాలు డ్రా చేసి, ఆ నిధులను అధికారులు, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు పంచుకున్నారనే బలమైన అనుమానం వ్యక్తమవుతోంది. ఆధార్ లింక్ తప్పనిసరి చేయడంతో, ఈ నకిలీ ఉద్యోగాల కుంభకోణం బయటపడుతుందనే భయంతోనే హెచ్‌ఓడీలు వివరాలను అప్‌లోడ్ చేయడం లేదని ప్రచారం జరుగుతోంది.
ఆధార్ లింక్ చేయని ఉద్యోగులకు వచ్చే నెల (నవంబర్) నుంచి జీతాలు చెల్లించరాదని ఆర్థిక శాఖ కఠిన సర్క్యూలర్ జారీ చేసింది. ఈ ఆదేశాలను బేఖాతరు చేసి ఎవరైనా జీతాలు చెల్లిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.
సీఎం రేవంత్ రెడ్డి ఈ మొత్తం వ్యవహారంపై తీవ్రంగా దృష్టి సారించారు. నమోదైన వివరాలను కూడా 360 డిగ్రీల్లో స్క్రూటినింగ్ చేసి, నకిలీ ఉద్యోగుల పేర్లను సృష్టించిన అధికారులపై చర్యలు తీసుకోవడమే కాక, అక్రమంగా తీసుకున్న జీతాలను రికవరీ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించిన అధికారులకు భయం పట్టుకుంది.



































