ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రేవంత్ సర్కార్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. ఆరోగ్య కార్డుల సమస్యకు సానుకూలంగా స్పందించింది. ఉద్యోగుల ఆరోగ్య కార్డులు, ఇతర పెండింగ్ సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగ సంఘాలతో సమావేశమై చర్చలు జరిపింది.


ఉద్యోగులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న నగదు రహిత ఆరోగ్య చికిత్స (క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్) కోసం ఆరోగ్య కార్డులను మంజూరు చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. మంగళవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర అధికారులతో కలిసి టీజీఈజాక్ ప్రతినిధులు మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు నేతృత్వంలో సుమారు 40 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై ఇప్పటికే పరిష్కరించినవి, అంగీకరించిన డిమాండ్లు, ఇంకా పరిశీలనలో ఉన్న 12 సమస్యలపై చర్చ జరిగింది. ప్రభుత్వం తరఫున ఒక అనధికారిక నోట్‌ను కూడా విడుదల చేశారు. ఉద్యోగులకు నగదు రహిత చికిత్స అందించేందుకు ఆరోగ్య కార్డుల మంజూరుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీనికి సంబంధించి విధివిధానాలను రూపొందించడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలోని అధికారుల కమిటీ ఈ నెల 8న సమావేశమై త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపు కోసం నెలకు రూ.700 కోట్ల నుంచి రూ.750 కోట్లు విడుదల చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే అంతకంటే ఎక్కువ నిధులు కేటాయించి బిల్లులను క్లియర్ చేస్తామని హామీ ఇచ్చింది.

విజిలెన్స్, ఏసీబీ కేసుల కారణంగా రెండేళ్లకు పైగా సస్పెన్షన్‌లో ఉన్న ఉద్యోగులకు దశలవారీగా పోస్టింగ్స్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం విద్యాశాఖ కార్యదర్శితో ప్రత్యేకంగా ఒక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. నర్సింగ్ డైరెక్టరేట్‌ను త్వరలో ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, దీపావళికి ఒక డీఏ (కరువు భత్యం) మంజూరు చేయాలని ఉద్యోగులు కోరగా.. దానిపై మాత్రం స్పష్టమైన హామీ లభించలేదని ఐకాస నేతలు తెలిపారు. ప్రభుత్వ సానుకూల నిర్ణయాల నేపథ్యంలో ఉద్యోగుల ఐకాస (టీజీఈజాక్) ఈ నెల 8వ తేదీ నుంచి 19 వరకు నిర్వహించాల్సిన ‘బస్సు యాత్ర’, అక్టోబరు 12న జరగాల్సిన ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.