RO Water: RO నీటిని ఇంట్లో వినియోగిస్తున్నారా? అయితే మీరు ఈ ముఖ్యమైన విటమిన్ లోపం బారిన పడవచ్చు

www.mannamweb.com


కుళాయి నీటిలో హానికరమైన టాక్సిన్లు, సీసం వంటి అకర్బన సమ్మేళనాలు ఉండే అవకాశం ఉంది. వీటివల్ల ఆరోగ్యానికి చాలా చేటు. అందుకే ఎంతోమంది ఇళ్లల్లో RO లను పెట్టుకుంటున్నారు.
దీన్ని వాడడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగించే బ్యాక్టీరియా, వైరస్లను ఇది 97% వరకు శుభ్రం చేస్తుంది. ఇవి నీటిలోని మలినాలను తొలగిస్తాయి. అయితే ఒక అధ్యయనం ప్రకారం నిత్యం RO వాటర్ తాగేవారు బి12 లోపానికి గురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా శాఖాహారులే ఈ విటమిన్ లోపం బారిన పడవచ్చు.

ఎలా బి12 లోపిస్తుంది?
విటమిన్ బి12 మన శరీరానికి అత్యవసరం.అయితే ROలో నీరు ప్రవహిస్తున్నప్పుడు అక్కడున్న ప్యూరిఫైయర్లు నీటిలో ఉన్న కోబాల్ట్ ను తొలగిస్తాయి. విటమిన్ బి12 సంశ్లేషణకు కోబాల్ట్ చాలా అవసరం. ఇది లోపిస్తే మన పొట్ట లైనింగ్ దెబ్బతింటుంది. విపరీతమైన అలసట వస్తుంది. ఈ అధ్యయనంలో భాగంగా 160 మంది రోగులపై పరిశోధన చేశారు. వారందరిలోనూ బి12 లోపం ఉంది. వారంతా శాఖాహారులు. అంతేకాదు వీరంతా ఇళ్లలో ROను ఉపయోగిస్తారు.అందరిలోనూ విటమిన్ బి12 లోపం వచ్చింది. విటమిన్ బి12 లోపిస్తే రక్తహీనత వచ్చే అవకాశం ఉంది. శరీరంలో ఎర్ర రక్తకణాలు సరిపడేంత ఉత్పత్తి కావు. దీనివల్ల శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ వెళ్లడం తగ్గుతుంది. అవయవాలకు సరిపడా ఆక్సిజన్ అందక అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల నుంచి తప్పించుకోవాలంటే విటమిన్ బి12 లోపం రాకుండా చూసుకోవాలి.

కనిపించే లక్షణాలు
విటమిన్ బి12 లోపిస్తే శరీరంలో ఎన్నో లక్షణాలు కనిపిస్తాయి. వీటిని తేలికగా తీసుకుని వదిలేయకూడదు.
1. కండరాలు బలహీనంగా అనిపిస్తాయి
2. చేతులు, కాళ్లలో తిమ్మిరి పడుతుంది
3. నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది
4. ఆకలి తగ్గుతుంది
5. బరువు తగ్గుతారు
6. వికారంగా అనిపిస్తుంది
7. చికాకుగా అనిపిస్తుంది
8. నాలుక సున్నితంగా మారుతుంది

ఏం తినాలి?
విటమిన్ బి12 లోపం బారిన పడకుండా ఉండాలంటే రోజూ కొన్ని రకాల ఆహారాలు తప్పకుండా తినాలి. పాలు, చీజ్, పెరుగు, చికెన్, మటన్, చేపలు, గుడ్లు, సోయా పాలు, పప్పులు… ఇలాంటి వాటిల్లో బి12 పుష్కలంగా లభిస్తుంది. RO నీళ్లు తాగుతున్నా కూడా వీటిని తినడం వల్ల ఆ లోపాన్ని తగ్గించుకోవచ్చు. రోజూవారీ ఆహారంలో ఇక్కడ చెప్పిన ఆహారాల్లో కనీసం రెండింటినైనా తినాలి. అలా తినడం వల్ల విటమిన్ లోపం నుంచి తప్పించుకోవచ్చు. శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలో ఇది కూడా ఒకటి. కాబట్టి దీన్ని లోపాన్ని తేలికగా తీసుకోకూడదు.