మీరు వెళ్లే దారిలో road accident జరిగిందా?.. ఈ ఒక్క పనిచేస్తే రూ.25వేలు మీ సొంతం

మనం రోడ్డుపై వెళ్లేప్పుడు నిత్యం ఎన్నో రోడ్డు ప్రమాదాలను (Road Accident) చూస్తుంటాం. కానీ, వారికి సాయం చేసేందుకు మాత్రం వెనకాడుతుంటాం.


కారణం.. ఎక్కడ ఆ కేసు వచ్చి మన మెడకు చుట్టుకుంటుందో అనే భయం. అయితే, ఇకపై అలా కళ్ల ముందు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న కాపాడాలంటే భయపడాల్సిన అవసరం లేదు. పైగా రోడ్డుప్రమాదానికి గురైన క్షతగాత్రులను కాపాడితే పాతిక వేలు నజరానా (25 Thousand price money ) కూడా పొందొచ్చు.

రోడ్డు ప్రమాదానికి గురైన బాధితులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల కిందటే ‘గుడ్‌ సమరిటన్‌’ పథకాన్ని (Good Samaritans Scheme) తీసుకొచ్చింది. ప్రమాదానికి గురైన క్షతగాత్రులను తక్షణం ఆసుపత్రులకు తరలించి వారి ప్రాణాలు నిలబడేలా చేస్తే రూ.5 వేలు ప్రోత్సాహకంగా అందించేది. ఇప్పుడు ఆ నగదును కేంద్రం రూ.25 వేలకు పెంచింది. దీని వల్ల ఎక్కువ మంది ప్రయాణికులు.. రోడ్లపై ప్రమాదాలకు గురైన బాధితులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఎక్కువ మందిని కాపాడితే రూ.లక్ష అదనపు ప్రోత్సాహం అందిస్తుంది.

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులు సకాలంలో సాయం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే బాధితులను గోల్డెన్‌ అవర్‌(ఘటన జరిగిన గంట లోపు) (Golden Hour) ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాలు నిలిచే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కేంద్రం ‘గుడ్ సమరిటన్’ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. కాపాడిన వారికి పోలీసు కేసుల భయం లేకుండా ఈ పథకం దోహదపడుతుంది.

ప్రాణాపాయంలో ఉన్నవారిని ఆసుపత్రులకి తీసుకెళ్లాక సంబంధిత స్టేషన్‌కు సమాచారం ఇస్తే పోలీసులు అధికారికంగా లేఖ ఇస్తారు. ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా, పోలీసు శాఖ, ఆసుపత్రి ధ్రువీకరణ పత్రాలను జత చేసి మండల తహసీల్దారుకు దరఖాస్తు (Apply in MRO Office) చేసుకుంటే నగదు బహుమతి అందజేస్తారు. ఇక గుడ్ సమారిటన్ పథకం వల్ల రోజూరోజుకు సాయం చేసే వారి సంఖ్య అంతకంతకూ పెరిగిందని కేంద్రం తెలిపింది.