తాడేపల్లిలో రహదారి వివాదం.. ఘోర పరాభవం తర్వాత కూడా మారని జగన్‌ తీరు

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి జగన్‌ క్యాంపు కార్యాలయం వద్ద డబుల్‌ లేన్‌ రోడ్డు వివాదాస్పదంగా మారింది. ప్రజాధనంతో నిర్మించిన ఆ మార్గంలో ఎవరినీ అనుమతించకుండా జగన్‌ భద్రతా సిబ్బంది ప్రైవేట్‌ రహదారిగా మార్చేశారు.


మరో వైపు ప్రజాధనంతో కట్టిన నిర్మాణాల నుంచే ఇప్పటికీ జగన్‌ రాజకీయాలు చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ఈ వ్యవహారాలపై త్వరలోనే ప్రభుత్వం విచారణకు ఆదేశించనున్నట్టు తెలుస్తోంది.

అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రజాసంక్షేమం కన్నా తన విలాసాలకే ప్రాధాన్యత ఇచ్చిన జగన్‌.. ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత కూడా ఏమాత్రం మారలేదు. ప్రజాధనాన్ని సొంత సొమ్ములా ఊహించుకుంటూ రాచరికంగా వ్యవహరిస్తున్నారు. జగన్‌ క్యాంపు కార్యాలయం వద్ద ప్రజాధనంతో నిర్మించిన డబుల్‌ లేన్‌ రహదారిని సొంత రోడ్డులా ఆక్రమించి.. ఆ వైపు ఏ ఒక్కరినీ అనుమతించకుండా నిషేధించారు. గత ప్రభుత్వ హయాంలో దాదాపు రూ.5కోట్ల వ్యయంతో 1.5 కి.మీ మేర రోడ్డు నిర్మాణం చేపట్టారు. ప్రకాశం బ్యారేజ్‌ నుంచి రేవేంద్రపాడు వరకు డబుల్‌ లేన్‌ రోడ్డు వేయాలని నిధులు మంజూరు చేస్తే.. వాటితో కేవలం 1.5 కి.మీ మేర మాత్రమే రోడ్డు నిర్మించారు. జగన్‌ ఇంటి ఎదురుగా ఉన్న కరకట్ట మార్గంపై కూడా రాకపోకలు నిలిపివేయడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. రేవేంద్రపాడు వైపు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, గృహ నిర్మాణాలు ఉన్నప్పటికీ ఐదేళ్లుగా అటు వైపు ఎవరినీ అనుమతించడంలేదు.

జగన్‌ క్యాంపు కార్యాలయంలో ప్రజాధనం వినియోగించి పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టారు. ఆ భవనం ప్రైవేటు కట్టడం అయినప్పటికీ భద్రత పేరుతో ఇంటి చుట్టూ ప్రహరీపై 20 అడుగుల ఎత్తులో ఐరన్‌ ఫెన్సింగ్‌, రూ.1.13 కోట్లు ఖర్చు చేసి సోలార్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. క్యాంపు కార్యాలయంలో ప్రస్తుతం వినియోగిస్తున్న ఫర్నిచర్‌, ఇతర సామగ్రి కూడా ప్రజాధనంతో కొనుగోలు చేసినవే. గతంలో సీఎం క్యాంపు కార్యాలయంగా ప్రకటించిన తర్వాత హైదరాబాద్‌లోని హెచ్‌ బ్లాక్‌ నుంచి యూపీఎస్‌, కంప్యూటర్లను అక్కడికి తరలించారు. ఆయన మాజీ ముఖ్యమంత్రిగా మారిన తర్వాత క్యాంపు కార్యాలయంలో రాజకీయ భేటీలు మాత్రమే నిర్వహిస్తున్నారు.

దీన్ని ప్రస్తుతం వైకాపా కేంద్ర కార్యాలయంగా మార్చుకున్నారు. ప్రజాధనంతో కొనుగోలు చేసిన ఫర్నిచర్‌, ఇతర సామగ్రిని వైకాపా కార్యాలయంలో వినియోగించుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. అప్పట్లో నిధుల మంజూరుకు విడుదల చేసిన జీవోలు, ప్రజాధనంతో ఏయే సామగ్రిని కొనుగోలు చేశారనే వివరాలను తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. దీనిపై త్వరలోనే విచారణకు ఆదేశించే అవకాశముంది.