భారత క్రికెట్ జట్టు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మరోసారి తన బ్యాట్‌తో చరిత్ర సృష్టించాడు. సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డే మ్యాచ్‌లో రోహిత్ అద్భుతమైన సెంచరీ సాధించాడు.
ఇది టీమ్ ఇండియాకు గౌరవప్రదమైన విజయాన్ని అందించడమే కాకుండా, అంతర్జాతీయ క్రికెట్‌లో ఆయనకు 50వ సెంచరీగా నమోదైంది. ఈ ఘనతతో ఆయన ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ డేవిడ్ వార్నర్‌ను వెనక్కి నెట్టి రికార్డు పుస్తకాల్లో చోటు దక్కించుకున్నారు.
రోహిత్ 125 బంతుల్లో 121 పరుగులు (నాటౌట్) చేశాడు. ఇందులో 13 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఇది ఆయన వన్డే కెరీర్‌లో 33వ సెంచరీ కాగా, మూడు ఫార్మాట్లు (టెస్ట్, వన్డే, టీ20) కలిపి 50వ సెంచరీ. ఈ ఘనతతో ఆయన సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీల ప్రత్యేక క్లబ్‌లో చేరిపోయారు. వీరిద్దరి పేరిట 50 లేదా అంతకంటే ఎక్కువ అంతర్జాతీయ సెంచరీలు నమోదై ఉన్నాయి. టాప్-10లో రోహిత్ శర్మ రోహిత్ శర్మ ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన టాప్-10 బ్యాటర్ల జాబితాలో చేరిపోయారు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ తరువాత ఈ ఘనత సాధించిన మూడో భారతీయ ఆటగాడు రోహిత్ శర్మ.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన టాప్-10 బ్యాటర్ల లిస్ట్:
| ర్యాంక్ | ఆటగాడి పేరు | సెంచరీలు |
| 1 | సచిన్ టెండూల్కర్ | 100 |
| 2 | విరాట్ కోహ్లీ | 82 |
| 3 | రికీ పాంటింగ్ | 71 |
| 4 | కుమార సంగక్కర | 63 |
| 5 | జాక్వెస్ కల్లిస్ | 62 |
| 6 | జో రూట్ | 58 |
| 7 | హషీమ్ ఆమ్లా | 55 |
| 8 | మహేల జయవర్ధనే | 54 |
| 9 | బ్రయాన్ లారా | 53 |
| 10 | రోహిత్ శర్మ | 50 |
ఈ సెంచరీతో వార్నర్ ఇప్పుడు 49 సెంచరీలతో 11వ స్థానానికి పడిపోయాడు. రోహిత్ దాదాపు 470 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఈ 50 సెంచరీల మైలురాయిని చేరుకున్నారు. భారత్‌కు ఘన విజయం మ్యాచ్ విషయానికి వస్తే, ఆస్ట్రేలియాను మూడో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 236 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత్ తరఫున హర్షిత్ రాణా అద్భుతమైన బౌలింగ్ చేసి 4 వికెట్లు పడగొట్టాడు.
లక్ష్య ఛేదనలో భారత్ నెమ్మదిగా మొదలు పెట్టినప్పటికీ, శుభ్‌మన్ గిల్ ఔటైన తర్వాత రోహిత్, విరాట్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. రెండో వికెట్‌కు వీరిద్దరూ 168 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కోహ్లీ 81 బంతుల్లో 74 పరుగులు చేశాడు. భారత్ కేవలం 38.3 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 239 పరుగులు చేసి మ్యాచ్ గెలిచింది. అయితే, ఆస్ట్రేలియా ఇప్పటికే మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.
































