బరువు తగ్గడం కోసం ఇప్పుడు ఎక్కువ మంది రాత్రిపూట చపాతీలను తినడానికే ఇష్టపడుతున్నారు. అన్నం తినడం తగ్గించారు. అయితే రోటీలు చేసేటప్పుడు కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి.
ఆహారం మిగలకుండా చేయడం, ఇంట్లో నివసించే సభ్యులను లెక్కపెట్టి దానికి అనుగుణంగా చపాతీలను చేయడం వంటివి చేస్తుంటారు. ఇవన్నీ కూడా ఇంట్లోని వ్యక్తులపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని చెబుతున్నారు నిపుణులు. రోటీలు చేయడానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన నమ్మకాలు ఉన్నాయి. వీటిని పాటిస్తే జీవితం సుఖంగా సాగిపోతుంది అని చెబుతున్నారు.
1. చపాతీలు చేయడానికి ముందు ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారో లెక్కపెట్టి, ఆ సభ్యులకి రెండు లేదా మూడు చొప్పున లెక్క గట్టి చపాతీలు చేస్తున్నారా? అలా చేస్తే ఇకపై చేయడం మానేయండి. అలా తయారు చేయడం వల్ల సూర్యభగవంతుడిని అవమానపరిచినట్టే అని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇలా చపాతీలను లెక్కపెట్టడం వల్ల జాతకంలో సూర్యుడి స్థానం బలహీన పడుతుందని అంటారు.అలా బలహీనపడితే కుటుంబంలో సంతోషం, శాంతి పై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి లెక్కపెట్టడం మానేసి ఎన్ని చపాతీలు అవుతాయో అన్ని చపాతీలు చేసి సర్దుకోవడం ఉత్తమం.
2. చపాతి పిండి కలిపేశాక కొంత భాగాన్ని ఫ్రిజ్లో దాచే అలవాటు కొంతమందికి ఉంటుంది. ఇలా చేయడం వల్ల మరుసటి రోజు పెద్దగా కష్టపడకుండా నేరుగా రోటీ చేసుకోవచ్చని అనుకుంటారు. ఇలా చపాతీ పిండి మిగిలితే దాన్ని ఫ్రిజ్లో దాచి ఉంచుకోవడం వల్ల ఆ వ్యక్తులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నమ్మకం ఉంది. ముఖ్యంగా రాహువు చెడు ప్రభావాన్ని చూపిస్తాడని అంటారు. అంతేకాదు ఇలా దాయడం వల్ల బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. ఇది శరీరానికి కూడా హాని కలిగిస్తుందని సైన్స్ చెబుతోంది.
3. ఎవరికైనా చపాతీలు వడ్డించేటప్పుడు ప్లేట్లో రెండు లేదా నాలుగు చపాతీలు పెట్టండి. కానీ మూడు చపాతీలు మాత్రం పెట్టకండి. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మాత్రమే ప్లేట్లో మూడు చపాతీలను పెట్టి సంతాప దినం రోజు నివేదిస్తారు. ఇలా కొన్ని కమ్యూనిటీలలో చేస్తారు. కాబట్టి బతికున్న వ్యక్తికి మూడు చపాతీలు పెట్టడం అనేది మంచిది కాదు. అది కేవలం చనిపోయిన వారికి సంబంధించినవి.
4. రోటీలు ఇంట్లో చేసినప్పుడు ఎప్పుడైనా కూడా ఆవు కోసం ఒకటి లేదా రెండు చపాతీలు చేయడం మంచిది. అది కూడా మొదటి రోటీని ఆవుకి పెడితే పితృ దోషాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. ఇక చివరి రోటీని కుక్క కోసం తయారు చేసి పెడితే మంచిది. ఇలా చేయడం వల్ల శత్రుభయం నుండి బయటపడవచ్చు.
5. భారతదేశంలో అతిథులను చాలా గౌరవంగా చూస్తారు. వారిని దేవుళ్లతో సమానమని నమ్ముతారు. కాబట్టి ఎవరైనా ఇంటికి అతిధులు ఆలస్యంగా వస్తే ఆహారం పెట్టడానికి వీలుగా అదనపు చపాతీలను చేయాలి. ఎప్పుడూ ఇంటి సభ్యులకు సరిపడా ఖచ్చితంగా చపాతీలను చేయకూడదు. అదనంగా చపాతీలు చేయాల్సిన అవసరం ఉంది. ఇది సాంప్రదాయపరంగా కూడా మంచి ఆలోచన.