రాయల్​ ఎన్​ఫీల్డ్​ గెరిల్లా 450 వేరియంట్లు- వాటి ఫీచర్స్, ధరలు​..

www.mannamweb.com


రాయల్ ఎన్​ఫీల్డ్​ తన లేటెస్ట్ మోడల్ గెరిల్లా 450ని కొన్ని రోజుల క్రితం ఆవిష్కరించింది. ఇది పట్టణ రైడర్లను ఆకర్షించడానికి రూపొందించిన స్ట్రీట్-ఫోకస్డ్ మోటార్ సైకిల్. అడ్వెంచర్ ఓరియెంటెడ్ రాయల్ ఎన్​ఫీల్డ్​ హిమాలయన్ 450ని ఈ కొత్త బైక్​ పోలి ఉంది. రాయల్ ఎన్​ఫీల్డ్​ గెరిల్లా 450 ప్రత్యేక స్టైలింగ్​ని కలిగి ఉంది. 452 సీసీ, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్​తో నడిచే ఈ బైక్​.. పర్ఫార్మెన్స్​, రిఫైన్​మెంట్​పై ఎక్కువగా ఫోకస్​ చేసింది. గెరిల్లా 450తో యువతను ఆకర్షించి మరింత డైనమిక్ కస్టమర్ బేస్​ని రూపొందించుకోవాలని రాయల్​ ఎన్​ఫీల్డ్​ భావిస్తోంది.

రాయల్ ఎన్​ఫీల్డ్​ గెరిల్లా 450 మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి.. అనలాగ్, డాష్, ఫ్లాష్. అనలాగ్ చాలా సింపుల్​గా ఉంటుంది డాష్, ఫ్లాష్ మోడళ్లు మరింత ఆధునిక అంశాలను పొందాయి. బేస్ వేరియంట్ ధర రూ .2.39 లక్షలు (ఎక్స్-షోరూమ్). రాయల్ ఎన్​ఫీల్డ్​ గెరిల్లా 450 మిడ్-సైజ్ బైక్​ సెగ్మెంట్​లో ఆధిపత్యమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మూడు వేరియంట్లలో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, వెనుక మోనోషాక్ ఉన్నాయి. రాయల్ ఎన్​ఫీల్డ్​ గెరిల్లా 450 బైక్ 17 ఇంచ్​ చక్రాలతో ప్రయాణిస్తుంది. ఇప్పుడు ఈ బైక్​లోని మూడు వేరియంట్ల విశేషాలను ఇక్కడ చూద్దాము..

 

రాయల్ ఎన్​ఫీల్డ్​ గెరిల్లా 450: అనలాగ్..

రాయల్ ఎన్​ఫీల్డ్​ గెరిల్లా 450 లైనప్ ఎంట్రీ పాయింట్, అనలాగ్ వేరియంట్ ధర రూ .2.39 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది ఇతర వేరియంట్లతో ప్రధాన భాగాలను పంచుకున్నప్పటికీ, సింపుల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​తో వస్తుంది.

రాయల్ ఎన్​ఫీల్డ్​ హంటర్ 350, రాయల్ ఎన్​ఫీల్డ్​ సూపర్ మెటియోర్ 650 బైకుల్లోని సెమీ డిజిటల్ యూనిట్​ ఈ కొత్త బైక్​లోనూ కనిపిస్తుంది. కానీ బ్లూటూత్ కనెక్టివిటీ లేదు. దాని బదులు రైడర్లు టర్న్-బై-టర్న్ నేవిగేషన్​ కోసం అదనపు ట్రిప్పర్ నావిగేషన్ పాడ్​ని ఎంచుకోవచ్చు. స్మోక్ సిల్వర్, ప్లేయా బ్లాక్​లలో ఈ బైక్​ లభిస్తుంది.

 

రాయల్ ఎన్​ఫీల్డ్​ గెరిల్లా 450: డాష్..

రాయల్ ఎన్​ఫీల్డ్​ గెరిల్లా 450 డాష్ వేరియంట్​.. బేస్ అనలాగ్ వేరియంట్​తో పోలిస్తే మరింత సాంకేతికంగా అధునాతన ప్యాకేజీని అందిస్తుంది. రాయల్ ఎన్​ఫీల్డ్​ హిమాలయన్ 450లో కనిపించే టీఎఫ్​టీ ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్ దీని ప్రత్యేకత.

 

ఈ ఆధునిక డిస్ప్లే గూగుల్ మ్యాప్స్ ద్వారా నావిగేషన్​ సహా స్మార్ట్​ఫోన్​ కనెక్టివిటీని అందిస్తుంది. రైడింగ్ అనుభవాన్ని పెంచుతుంది. రూ .2.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధర కలిగిన డాష్ రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి ప్లేయా బ్లాక్, డ్యూయెల్-టోన్ గోల్డ్ డిప్.

 

రాయల్ ఎన్​ఫీల్డ్​ గెరిల్లా 450: ఫ్లాష్..

రాయల్ ఎన్​ఫీల్డ్​ గెరిల్లా 450 శ్రేణి టాప్​ ఎండ్​ వేరియంట్​ ఈ ఫ్లాష్​. డాష్​తో పోల్చితే ఈ ఫ్లాష్​ వేరియంట్​ ధర రూ .15,000 ఎక్కువ. ఇది స్మార్ట్​ఫోన్​ కనెక్టివిటీతో అదే టీఎఫ్​టీ ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్​ని పంచుకున్నప్పటికీ, రాయల్ ఎన్​ఫీల్డ్​ గెరిల్లా 450 ఫ్లాష్ నిజంగా దాని కలర్ ప్యాలెట్​తో ప్రత్యేకతను కలిగి ఉంది.

కొనుగోలుదారులు అద్భుతమైన ట్రిపుల్-టోన్ ఎల్లో రిబ్బన్ లేదా అధునాతన డ్యూయెల్-టోన్ బ్రావా బ్లూ నుంచి ఎంచుకోవచ్చు. ఈ విలక్షణమైన కలర్ ఆప్షన్లు, బైక్ మొత్తం డిజైన్​తో కలిపి, బలమైన విజువల్ ఇంపాక్ట్​ని సృష్టిస్తుంది.