‘తిరుమలలోని పరకామణిలో రూ.100 కోట్ల కుంభకోణం’

www.mannamweb.com


పొట్టలో రహస్య అర.. విదేశీ కరెన్సీ తరలింపువిచారించి చర్యలు తీసుకోండి
తితిదే ఛైర్మన్‌కు భానుప్రకాష్‌రెడ్డి వినతి

ఈనాడు, తిరుపతి: తిరుమలలోని పరకామణిలో రూ.

100 కోట్ల విలువైన కుంభకోణం జరిగిందని, దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తితిదే పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్‌కు వినతి పత్రాన్ని అందించారు. పరకామణిలో పెద్దజీయర్‌ తరఫున సి.వి.రవికుమార్‌ అనే వ్యక్తి విదేశీ కరెన్సీని లెక్కించే వారని, కొన్నేళ్లుగా ఆయన రహస్యంగా దాదాపుగా రూ. 200 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని బయటకు తరలించినట్లు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. భద్రతా సిబ్బంది గుర్తించకుండా ఆపరేషన్‌ ద్వారా శరీరంలో రహస్య అర కూడా పెట్టించుకున్నారని పేర్కొన్నారు.

2023 ఏప్రిల్‌ 29న శ్రీవారి హుండీ నగదు తరలిస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని తెలిపారు. వెంటనే విజిలెన్స్‌ సహాయ భద్రతాధికారి సతీష్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు. రవికుమార్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని, అయితే నిందితుడిని అరెస్టు చేయకుండా అదే ఏడాది సెప్టెంబరులో లోక్‌ అదాలత్‌లో రాజీకి వచ్చారన్నారు. నాటి తితిదే అధికారులు కొందరు, పోలీసులు, నాటి తితిదే ఛైర్మన్‌ కలిసి రవికుమార్‌ను బెదిరించి రూ. 100 కోట్ల విలువైన ఆస్తులను రాయించుకున్నారని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు.