వరద బాధితులకు రూ.15 వేలు ఆర్థిక సాయం.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన

సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. మొంథా తుపాను ప్రభావానికి గురైన వరద బాధితులకు రూ.15 వేలు ఆర్థిక సాయం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందిస్తామన్నారు.


ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులైన వాళ్లను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఇక వివరాల్లోకి వెళ్తే మొంథా తుపాను ప్రభావానికి గురైన ప్రాంతాల్లో సీఎం రేవంత్‌ శుక్రవారం ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆ తర్వాత సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుపాను ప్రభావంతో 12 జిల్లాల్లో నష్టం జరిగిందని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి పూర్తిస్థాయి నష్టాన్ని అంచనా వేయాలన్నారు. ” వరద ప్రభావం వల్ల ప్రాణనష్టం, పంట నష్టం, పశుసంపదతో పాటు అన్ని శాఖలకు సంబంధించి జరిగిన నష్టాన్ని నివేదిక అందించండి.

ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాలకు సంబంధించి కలెక్టర్లకు నివేదికలు ఇవ్వండి. తుఫాను ప్రభావం వల్ల రాష్ట్రంలో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను ప్రభుత్వం రాబట్టుకుంటుంది. తాత్కాలిక పరిష్కారం కాకుండా శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు వేయండి. సమన్వయ లోపంతో సమస్యలు పెరుగుతున్నాయి. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలి.

ఇళ్లు మునిగిన బాధితుల్లో ప్రతీ ఇంటికి రూ.15 వేలు ఇస్తాం. ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులైన వారిని గుర్తించి వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే అంశాన్ని అధికారులు పరిశీలించాలి. ఆవులు, గేదెలు చనిపోతే రూ.50వేలు.. మేకలు, గొర్రెలకు రూ.5వేలు, పంట నష్టం కింద ఎకరాకు రూ.10వేలు చెల్లిస్తాం. మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పనిచేయాలి.జిల్లా కలెక్టర్లు ఫీల్డ్ విజిట్స్ చేయాల్సిందే స్మార్ట్ సిటీలో చేయాల్సిన పనులపై ప్రత్యేక నివేదిక తయారు చేయండని” సీఎం రేవంత్ వివరించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.