కాంగ్రెస్ మేనిఫెస్టోలోని హామీ మేరకు ఒకేసారి 2లక్షల రైతు రుణమాఫీ అమలుచేసేలా ఆర్బీఐ, బ్యాంకులతో కసరత్తు జరుపుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గత సర్కార్ విడతలుగా రుణమాఫీ చెల్లించి రైతులకు ఎలాంటి ప్రయోజనం దక్కకుండా చేసిందని, కానీ తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని, రైతులకు ప్రయోజనం చేకూరే నిర్ణయాలే తాము తీసుకుంటామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఓఆర్ఆర్ కుదువ పెట్టి మరీ సగం మందికే అమలు చేశారని బీఆర్ఎస్ ప్రభుత్వంపై మంత్రి మండిపడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరుగుతోందని మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు.
‘ఆర్థిక పరిస్థితి దిగజారినప్పటికీ రైతుల శ్రేయస్సుకు మేము తొలి ప్రాధాన్యమిస్తున్నాం. అధికారంలో ఉండగా ఏనాడు పంట పొలాలని సందర్శించని బీఆర్ఎస్ నేతలు..ఇప్పుడు రైతులపై ప్రేమ కురిపిస్తూ..ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. పంటల బీమా పథకం అమలు చేసి ఉంటే పంటలు ఎండిపోయిన రైతులను ఆదుకునేందుకు అవకాశం ఉండేది. 2023-24 యాసంగి సీజన్‌కు సంబంధించి దాదాపు 93 శాతం రైతుబంధు నిధులు జమ చేశాం. గత ప్రభుత్వానికి భిన్నంగా అకాల వర్షాలు, వడగండ్లకు నష్టపోయిన రైతులకు ఎకరానికి 10వేల పరిహారం అందిస్తాం’ అని మంత్రి తుమ్మల తెలిపారు.