సంప్రదాయ చేతి వృత్తుల వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పీఎం విశ్వకర్మ యోజన అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకాన్ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రకటించారు.
సంప్రదాయ వృత్తులు చేసే, చేతి వృత్తుల్లో పని చేసే వెనుకబడిన వర్గాల కోసం పీఎం విశ్వకర్మ స్కీమ్ పేరిట రూ. 15 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పారు. ఈ స్కీమ్ 2023-24 నుంచి 2027-28 వరకు అయిదేళ్ల పాటు అమలులో ఉంటుంది. సెప్టెంబర్ 17న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ స్కీమ్ ప్రారంభించారు. గురు- శిష్య వారసత్వ పరంపరను ప్రోత్సహించి సంప్రదాయ పని ముట్లను, చేతులను ఉపయోగించి పని చేసే కళాకారుల కుటుంబ ఆధారిత వృత్తులను బలోపేతం చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశంగా ప్రభుత్వం తెలిపింది. చేతి పనుల వారు, కాళాకారులు చేసే ఉత్పత్తుల నాణ్యతను పెంచడం, వారిని దేశీయ, గ్లోబల్ మార్కెట్‌తో అనుసంధానించడం ఈ స్కీమ్ వెనుకున్న మరో ముఖ్య ఉద్దేశమని ప్రకటించింది. పీఎం విశ్వకర్మ యోజన ద్వారా ఎవరికి లబ్ది చేకూరనుంది? ఏ వృత్తుల వారు ఈ పథకానికి అర్హులు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.
లబ్ధిదారులకు కలిగే ప్రయోజనాలు ఏంటి?
ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన ద్వారా కళాకారులు, చేనేత కార్మికులకు పీఎం విశ్వకర్మ సర్టిఫికెట్‌తో పాటు గుర్తింపు కార్డును అందిస్తారు. అలాగే, తొలి విడత కింద రూ.1 లక్ష వరకు, రెండో విడత కింద రూ. 2 లక్షల రుణం అందిస్తారు. దీనికి కేవలం 5 శాతం వడ్డీ వసూలు చేస్తారు. ఇది ఇతర లోన్లతో పోలిస్తే చాలా తక్కువని చెప్పాలి.
ఏ వృత్తుల వారు అర్హులు?
దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని కళాకారులు, చేతి వృత్తులవారికి ఈ స్కీమ్ వర్తిస్తుంది. అందులో తొలుత 18 సంప్రదాయ వృత్తులకు ఈ స్కీమ్ ప్రయోజనాలు అందనున్నాయి. అవి.. వడ్రంగి(సుతార్), స్వర్ణకారులు, కుమ్మరి, కమ్మరి, శిల్పులు, రాతి పని చేసే వారు, చెప్పులు తయారు చేసేవారు, మేసన్, తాపీ పని, బుట్టలు, చాపలు, చీపుర్లు, తాళ్లు అల్లేవారు, సంప్రదాయకంగా బొమ్మలు తయారు చేసేవారు, క్షురకులు, పూలదండలు చేసేవారు, లాండ్రీ , టైలర్, చేపల వలలు తయారు చేసేవారు, సుత్తి- పనిముట్లు తయారు చేసేవారు, తాళాలు తయారు చేసేవారు ఉన్నారు.
రోజుకు రూ.500 ఇస్తూ శిక్షణ..
పీఎం విశ్వకర్మ పథకానికి సంబంధించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గంతంలోనే కీలక వ్యాఖలు చేశారు. చేతివృత్తుల వారికి శిక్షణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. బేసిక్, అడ్వాన్స్‌డ్ స్థాయిలో ఈ శిక్షణా కార్యక్రమాలు ఉంటాయి. ట్రైనీలకు రోజుకు రూ. 500 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని, పారిశ్రామిక పనిముట్ల కొనుగోలు కోసం అవసరమైన వారికి రూ.15,000 ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు.
30 లక్షల కుటుంబాలకు లబ్ధి..
ఈ పథకం ద్వారా తొలి ఏడాది 5 లక్షల కుటుంబాలకు, అయిదేళ్లలో మొత్తం 30 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 17న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.
20 రోజుల్లోనే 5 లక్షల దరఖాస్తులు..
పీఎం విశ్వకర్మ యోజన స్కీమ్ ప్రారంభించిన 20 రోజుల్లోనే ఏకంగా 5.24 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు కేంద్రం తెలిపింది. అందులే మొదటి దశ వెరిఫికేషన్ పూర్తయినవి 1749 కాగా.. రెండో దశకు చేరుకున్నవి 2 ఉన్నాయి. మూడో దశ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత వారికి రూ.1 లక్ష వరకు లోన్ మంజూరు చేస్తారు.