ఆంధ్రప్రదేశ్‌లో మైనారిటీల అభ్యున్నతికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటనలు చేశారు. మైనారిటీ సంక్షేమ దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ, ముస్లిం మైనారిటీల ఆర్థిక, విద్యా రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
ముఖ్యంగా మైనారిటీ ఆడపిల్లలకు ఇంటర్‌మీడియట్ వరకు ఉచిత విద్యను అందించేలా చర్యలు తీసుకుంటామని సీఎం ప్రకటించారు. విద్యే శక్తి అని, ఆడపిల్లలు చదువుకుంటేనే కుటుంబం, సమాజం ఎదుగుతుందని ఆయన అన్నారు. ఈ నిర్ణయం ముస్లిం ఆడపిల్లలలో విద్యాపై ఆసక్తి పెంచడమే కాకుండా, వారి భవిష్యత్తును సురక్షితం చేయడంలో కీలక మలుపు అవుతుందని పేర్కొన్నారు.
ఇమామ్‌లు, మౌజమ్లకు పెండింగ్‌లో ఉన్న వేతనాలను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చంద్రబాబు తెలిపారు. ధార్మిక సేవలు చేస్తున్న వారికి గౌరవం ఇవ్వడం తమ బాధ్యత అని, ప్రతి మసీదుకు నెలకు రూ. 5 వేల చొప్పున సహాయం అందించే పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. ఈ చర్యతో మసీదుల నిర్వహణకు అవసరమైన ఆర్థిక భారం తగ్గుతుందని, మతపరమైన కార్యకలాపాలు సాఫీగా సాగుతాయని ఆయన వివరించారు. అంతేకాకుండా, మైనారిటీల సామాజిక, ఆర్థిక స్థితిని మెరుగుపరిచే దిశగా ప్రత్యేక పథకాలు రూపొందిస్తున్నామని తెలిపారు.
వక్స్ బోర్డు చట్ట సవరణపై మాట్లాడిన సీఎం, ‘వక్స్ ఆస్తులను ఎవరి ఆధీనంలో ఉంచినా, వాటి సంరక్షణ మాత్రం మైనారిటీల ద్వారానే జరుగుతుంది’ అని స్పష్టం చేశారు. వక్స్ ఆస్తులను పూర్తిగా డిజిటలైజ్ చేసి పారదర్శకతతో నిర్వహించడానికి చర్యలు చేపట్టబోతున్నామని తెలిపారు. ఈ డిజిటల్ వ్యవస్థ ద్వారా ఎవరైనా ఆస్తుల వివరాలను పరిశీలించగలరని, అవినీతి, దుర్వినియోగం వంటి అంశాలకు ఇక అవకాశం ఉండదని చెప్పారు. మైనారిటీలకు గౌరవప్రదమైన స్థానం కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని, న్యాయం, సమానత్వం, అభివృద్ధి అనే మూడు సూత్రాల ఆధారంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.



































