ముడి చమురు స్టోరేజ్‌ కోసం రూ.5,700 కోట్లతో ప్రాజెక్ట్‌

భారతదేశ ఇంధన మౌలిక సదుపాయాలు పెంచే లక్ష్యంతో మేఘా ఇంజినీరింగ్ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్ (ఎంఈఐఎల్) చర్యలు చేపట్టింది. కర్ణాటకలోని పాదుర్‌లో రూ.5,700 కోట్ల వ్యయంతో వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్ (ఎస్‌పీఆర్‌) యూనిట్‌ను నిర్మించనున్నట్లు తెలిపింది.


దేశంలోని ప్రైవేట్‌ రంగ సంస్థ ఈ విభాగంలో భారీగా పెట్టుబడులు పెట్టడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ చొరవ సాంప్రదాయకంగా ప్రభుత్వ రంగ సంస్థల ఆధిపత్యంలో ఉన్న ఇంధన భద్రతలో పరివర్తనాత్మక మార్పును సూచిస్తుంది.

వ్యూహాత్మక ముందడుగు

ఈ ప్రాజెక్ట్ ద్వారా 2.5 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటీ) ఎస్‌పీఆర్‌ను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది భారతదేశం అత్యవసర ముడి చమురు నిల్వలకు గణనీయంగా దోహదపడుతుందని భావిస్తున్నారు. దేశంలో ప్రస్తుతం ఉన్న 5.33 ఎంఎంటీ వ్యూహాత్మక నిల్వలను పెంచడానికి ఈ సదుపాయం తోడ్పడుతుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటివరకు ఉన్న నిల్వల ద్వారా పూర్తి సామర్థ్యంతో 8-9 రోజుల జాతీయ ముడి చమురు డిమాండ్‌ను తీర్చవచ్చు. కొత్త స్టోరేజీ అందుబాటులోకి వస్తే మరిన్ని రోజులు ఇంధన భద్రత ఉంటుందని చెబుతున్నారు.

ఇది అమలులోకి వస్తే ప్రపంచ సరఫరా అంతరాయాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు లేదా ఊహించని డిమాండ్ పెరిగినా దేశ ఇంధన బఫర్‌కు తోడ్పడుతుంది. ఈ రిజర్వ్‌ను నిర్మించడానికి ఎంఈఐఎల్‌కు ఐదేళ్ల సమయం అవసరం అవుతుందని తెలిపింది. 60 సంవత్సరాల పాటు కంపెనీ దీని నిర్వహణ బాధ్యతలు చేపడుతుంది. ప్రస్తుత ప్రపంచ చమురు ధరల ప్రకారం ఈ కెపాసిటీలో ముడి చమురు నింపే ఖర్చు 1.25 బిలియన్ డాలర్లు (రూ.11,020 కోట్లు)గా అంచనా వేశారు. దాంతో ఇది భారతదేశ వ్యూహాత్మక పెట్రోలియం మౌలిక సదుపాయాల్లో అతిపెద్ద ప్రైవేట్ రంగ పెట్టుబడిగా నిలిచింది. ఈ స్టోరేజ్‌ యూనిట్‌ను కంపెనీ నేరుగా నిర్వహించవచ్చు లేదా ఇతర చమురు నిర్వహణ సంస్థలకు లీజుకు ఇవ్వొచ్చు.

‍ప్రత్యేకతలు..

మొదటి ప్రైవేట్ ఎస్‌పీఆర్‌: ఇంధన నిల్వల్లో ప్రభుత్వ సంస్థల గుత్తాధిపత్యాన్ని వైవిధ్యం చేస్తుంది.

పబ్లిక్-ప్రైవేట్ సినర్జీ: జాతీయ భద్రతతో అనుసంధానించిన మౌలిక సదుపాయాల్లో ప్రైవేట్ సంస్థలు పాల్గొనేలా ప్రభుత్వ దృక్పథం మారడాన్ని ప్రతిబింబిస్తుంది.

ఇంధన భద్రత: అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారతదేశ చమురు నిల్వలకు కీలకంగా మారనుంది.

వ్యూహాత్మక ప్రదేశం: పదుర్ ఇప్పటికే ఎస్పీఆర్ మౌలిక సదుపాయాలకు కేంద్రంగా ఉంది. ఇది లాజిస్టిక్, కార్యాచరణ సామర్థ్యాలను సులభతరం చేస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.