ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఛార్జింగ్‌ అవ్వట్లేదు.. రూ. 2 లక్షలు చెల్లించాలని కేసు..

www.mannamweb.com


ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్‌ వాహనాలకు భారీగా డిమాండ్‌ పెరుగుతోంది. ప్రభుత్వం రాయితీ అందిస్తుండడం, తక్కువ ఖర్చులో ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉండడంతో చాలా మంది వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

అయితే కొన్ని సందర్భాల్లో ఈ వాహనాలు తలెత్తుతోన్న సమస్యలు వినియోగదారులను ఇబ్బందికి గురి చేస్తున్నాయి. మొన్నటిమొన్న ఓలా కంపెనీపై అసహనంతో ఓ వ్యక్తి ఏకంగా షోరూమ్‌ని తగలబెట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇలాంటి అనుభవమే మరో వినియోగదారుడికి ఎదురైంది.

దీంతో ఆయన న్యాయ మార్గాన్ని ఎంచుకున్నాడు. తనను మోసం చేసినందుకు గాను రూ. 2 లక్షలు చెల్లించాలని కేసు వేశాడు. వివరాల్లోకి వెళితే.. మచిలీపట్నం మండలం సుల్తానగరం గొల్లపాలెం చెందిన బత్తుల హరినాథ్ మచిలీపట్నంలోని టీవీఎస్‌ షోరూమ్‌లో ఐ క్యూబ్ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను కొనుగోలు చేశారు. రూ. 1,63,461 చెల్లించిన స్కూటర్‌ను ఇంటికి తీసుకెళ్లాడు. నాలుగు గంటల్లో బ్యాటరీ ఫుల్‌ ఛార్జ్‌ అవుతుందన్న ప్రకటన చూసి బైక్‌ను కొనుగోలు చేశాడు హరినాథ్‌.

అయితే ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఛార్జింగ్ పెడితే బండి ఎంతకీ ఛార్జింగ్‌ అవ్వలేదు. దీంతో షోరూమ్‌ వాళ్లకు విషయాన్ని తెలిపారు. బండి తయారీలో లోపం ఉందని కంపెనీ ఇంజనీర్లు వచ్చి రిపేర్ చేస్తారని చెప్పి బండిని షో రూమ్ లోనే ఉంచారు. అయితే నెల రోజులు దాటినా బండి మాత్రం రిపేర్‌ కాలేదు. దీంతో విసుగు చెందిన బాధితుడు.. మచిలీపట్నం టీవీఎస్ డీలర్ మీద, చెన్నై టీవీఎస్ మోటార్ కంపెనీ మీద కృష్ణా జిల్లా వినియోగదారుల కమిషన్ లో కేసు కేసు దాఖలు చేశాడు. బుధవారం వినియోగదారుల కమిషన్ కేసును విచారణ స్వీకరించి అక్టోబర్ 21 తారీఖున టీవీఎస్ కంపెనీ ప్రతినిధులు వినియోగదారుల కమిషన్ ముందు ముందు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు.

ప్రతివాదులైన కాసా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు టీవీఎస్ మోటార్ కంపెనీ వారు వినియోగదారుడికి కొనుగోలు చేసిన 1,63,461.00 లను 24% వడ్డీతో చెల్లించాలని మానసిక ఆందోళన కలిగించినందుకు మోసానికి గురి చేసినందుకు రెండు లక్షలు చెల్లించాలని 25 వేల రూపాయలు లీగల్ చార్జీలకు చెల్లించాలంటూ ఫోరంలో కేసు దాఖలు చేశారు. ప్రాథమికంగా కేసును పరిశీలించిన జిల్లా కృష్ణా జిల్లా వినియోగదారుల కమిషన్ కేసును విచారణ స్వీకరించి ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది అక్టోబర్ 21న హాజరై వారి సంజాయిషీ చెప్పాలని నోటీసులు పేర్కొన్నారు.