ఎస్‌బీఐ శాలరీ అకౌంట్‌తో రూ.కోటి ప్రమాద బీమా

కుటుంబ యజమాని అనుకోని సంఘటనలో మృతి చెందితే అతనిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబం రోడ్డున పడకుండా ఎస్‌బీఐ శాలరీ ఖాతాదారులకు ప్రమాద బీమా పథకంతో ఆర్థిక భరోసా కల్పిస్తుందని ఎస్‌బీఐ విజయవాడ వెస్ట్‌ రీజనల్‌ మేనేజర్‌ శ్రీనివాసరావు తెలిపారు.


ఎస్‌బీఐ డీఆర్‌ఎం కార్యాలయంలో శనివారం ఇటీవల రైల్వేలో విధులు నిర్వర్తిస్తూ ప్రమాదవశాత్తు మరణించిన వ్యక్తికి ఎస్‌బీఐ బ్యాంకు మంజూరు చేసిన రూ.40లక్షల ప్రమాద బీమా చెక్కును ఆర్‌ఎం శ్రీనివాసరావు చేతుల మీదుగా మృతుని భార్యకు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్‌ఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎస్‌బీఐలో శాలరీ అకౌంట్‌లు కలిగిన ఉద్యోగులకు గతంలో ఉన్న పర్సనల్‌ యాక్సిడెంట్‌ ఇన్సూరెన్స్‌ (పీఏఐ) కవరేజ్‌ను రూ.40 లక్షల నుంచి ఒక కోటి రూపాయలకు పెంచినట్లు తెలిపారు. ఈ బీమా కేవలం రైల్వే ఉద్యోగులకే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, కార్పొరేట్‌ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా వేర్వేరు ప్యాకేజీలతో ప్రమాద బీమా కవరేజ్‌ వర్తించనున్నట్లు తెలిపారు. ఇందులో పర్సనల్‌ యాక్సిడెంట్‌ ఇన్సూరెన్స్‌ కోటి రూపాయలు, ఎయిర్‌ యాక్సిడెంట్‌ ఇన్సూరెన్స్‌ రూ.2.60 కోట్లు, సహజ మరణం సంభవిస్తే రూ.10 లక్షల కవరేజ్‌ అందుతుందన్నారు. ఇవే కాకుండా ఇతర ఖాతాదారులు కూడా సంవత్సరానికి రూ.2 వేలు చెల్లిస్తే వారికి పర్సనల్‌ యాక్సిడెంట్‌ ఇన్సూరెన్స్‌ రూ.10 లక్షల కవరేజ్‌ ఉంటుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటురంగ సంస్థల్లోని ఉద్యోగులు ఎస్‌బీఐలో శాలరీ అకౌంట్‌ తీసుకుని ఉచిత బీమా పథకంతో వారి కుటుంబానికి భరోసా కల్పించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. కార్యక్రమంలో ఎస్‌బీఐ డీఆర్‌ఎం కార్యాలయ బ్రాంచ్‌ మేనేజర్‌ సుకుమార్‌, రీజనల్‌ కార్యాలయ చీఫ్‌ మేనేజర్‌ భాస్కర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.