Minister Dola: రుషికొండ భవనాలు కచ్చితంగా వినియోగిస్తాం: మంత్రి వీరాంజనేయస్వామి

www.mannamweb.com


ప్రకాశం: విశాఖ రుషికొండ(Rushikonda)పై నిర్మించిన భవనాలను ఎన్డీయే ప్రభుత్వం(NDA government) కచ్చితంగా ఉపయోగించుకుంటుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయస్వామి ( Minister Dola Veeranjaneya Swamy ) స్పష్టం చేశారు.

భవనాలను ఏ విధంగా ఉపయోగించాలనే దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని మంత్రి చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం మాదిరిగా తాము ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయమన్నారు.

ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వం అమరావతిలో ప్రజావేదికను కూల్చివేయడాన్ని గుర్తు చేశారు. అలాంటి పనులు ఎప్పటికీ తమ అధినేత చేయరన్నారు. ప్రభుత్వ డబ్బు వృథా కానివ్వమని, నష్టం కలిగించేలా వ్యవహరించమని వెల్లడించారు. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీలో నిలబడలేకపోతున్నారని, వారు ఎవరెవరితో టచ్‌లో ఉన్నారనే విషయాన్ని మాత్రం చెప్పనన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఎటుచూసినా విశాఖ రుషికొండ భవనాలు, తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ఫర్నిచర్‌పైనే చర్చ జరుగుతోంది. వైఎస్ భారతి కోసం రూ.560కోట్లు వెచ్చించి రుషికొండపై అత్యంత విలాసవంతమైన భవనాలు జగన్ నిర్మించారంటూ అధికార పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బాత్ టబ్ కోసమే రూ.26లక్షలు వెచ్చించడంపై మండిపడుతున్నారు. అలాగే వైసీపీ క్యాంపు కార్యాలయంలోని ఫర్నిచర్ ఎప్పుడు తిరిగి ఇస్తారంటూ జగన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

2014లో చంద్రబాబు ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదికను తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూల్చివేయడంతో.. ప్రస్తుతం రుషికొండ భవనాలను ఏం చేస్తారో అంటూ చర్చ నడుస్తోంది. దీనిపై స్పందించిన మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి.. కచ్చితంగా ప్రభుత్వ కార్యక్రమాలకు ఆ భవనాలను వినియోగిస్తామని స్పష్టం చేశారు.