సచివాలయ ఉద్యోగుల సేవలు అలా.. కూటమి సంచలన నిర్ణయం

: కూటమి ప్రభుత్వం( Alliance government ) దూకుడు మీద ఉంది. కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. ముఖ్యంగా ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టింది.


పెద్ద ఎత్తున పరిశ్రమలను స్థాపించడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పరచాలని భావిస్తోంది. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కూడా చర్యలు తీసుకుంటుంది. ఈ నెలలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది. దాదాపు 16 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారు. అలాగే సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కూడా భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది.

* కొత్త ఆలోచనతో ప్రభుత్వం..
అయితే ప్రధానంగా సచివాలయ ఉద్యోగుల( Sachivalaya employees) విషయంలో ఏం చేయాలన్న దానిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2019 అక్టోబర్ రెండున సచివాలయ వ్యవస్థ ప్రారంభమైంది. దాదాపు 12 శాఖలకు సంబంధించి సహాయకులను నియమించారు. కార్యదర్శుల పేరుతో నియామకాలు జరిపారు. అయితే అప్పట్లో చాలా శాఖలకు సంబంధించిన ఖాళీలు ఉండిపోయాయి. అటు తర్వాత ఆ ఖాళీలపై వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దగా దృష్టి సారించిన దాఖలాలు లేకుండా పోయాయి. అందుకే ఇప్పుడు ఖాళీలను భర్తీ చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

* క్లస్టర్లుగా విభజించి
వాస్తవానికి కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయ వ్యవస్థ రద్దు చేస్తారని అంతా భావించారు. అందుకు తగ్గట్టుగానే ఆ మధ్యన ప్రభుత్వం ఒక సర్వే చేపట్టింది. మూడు క్లస్టర్లుగా సచివాలయ ఉద్యోగులను విభజించింది. కొన్నిచోట్ల తక్కువ మంది.. మరి కొన్ని చోట్ల ఎక్కువమంది ఉన్నట్లు గుర్తించింది. అందుకే సర్దుబాటు చేయాలని ఒక నిర్ణయానికి వచ్చింది. అలాగే మిగులు సిబ్బంది ఉంటే ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేందుకు కూడా సిద్ధపడింది. కానీ ఎందుకో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. అయితే ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందుబాటులోకి తెచ్చిన తరుణంలో సచివాలయ ఉద్యోగుల వేరే శాఖకు సర్దుబాటు ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం ఖాళీల భర్తీపై దృష్టి పెట్టడంతో సర్దుబాటు అనేది ఉండదని తెలుస్తోంది.

* పదోన్నతులకు ఛాన్స్..
సచివాలయ ఉద్యోగులకు సంబంధించి చాలా మంది విద్యాధికులు ఉన్నారు. డిగ్రీ అర్హతతో( graduate) సచివాలయ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ జరిగింది. కానీ బీటెక్, ఎంటెక్, ఎమ్మెస్సీ చేసిన వారు సైతం ఈ ఉద్యోగాలకు పోటీపడ్డారు. ఎంపికయ్యారు కూడా. అయితే వారికి సచివాలయ ఉద్యోగం పై అసంతృప్తి ఉంది. ఎదుగుదల ఉండదన్న అభిప్రాయం ఉంది. అందుకే ఇందులో విద్యాధికులుగా ఉన్న వారిని గుర్తించి ప్రమోషన్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇంజనీరింగ్ సహాయకులుగా ఉన్నవారిని ఆర్ అండ్ బి, ఇరిగేషన్, పంచాయితీ రాజ్ శాఖ సహాయ ఇంజనీర్లుగా ప్రమోషన్ ఇచ్చేందుకు కూడా ఆలోచిస్తోంది. ఇటీవల క్యాబినెట్ సమావేశంలో సైతం దీనిపైనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది.