సజ్జల నోటికి తాళం !

జగన్మోహన్ రెడ్డి వాయిస్ తానేనని తాను ఏం చెబితే అది జగన్ రెడ్డి చెప్పినట్లేనని పదే పదే మీడియా ముందుకు వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నికల ఫలితాల తర్వాత మీడియా మైకుల ముందుకు రావడం లేదు.


సాక్షితో పాటు కూలీ మీడియాను గుప్పిట్లో పెట్టుకుని ఎప్పుడు మాట్లాడాలనిపిస్తే అప్పుడు మైకుల్ని తన మూతి ముందుకు రప్పించుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం… మాట్లాడాల్సి వచ్చినా మాట్లాడటం లేదు.

సజ్జల సైలెంట్ గా ఉండటంతో ఆజ్ఞాతంలోకి పోయారని చాలా మంది అనుకుంటున్నారు. సజ్జల కుమారుడు ఆజ్ఞాతంలో ఉన్నారు కానీ సజ్జల మాత్రం వైసీపీ ఆఫీసులో కనిపిస్తున్నారు. జగన్ పెట్టే సమవేశాలకు హాజరవుతున్నారు. అయితే తనపై ఫోకస్ లేకుండా చూసుకుంటున్నారు. మీడియా ముందుకు రావడం లేదు.

పార్టీపై పట్టు సాధించిన సజ్జలను ఇప్పటికిప్పుడు జగన్ దూరం చేసుకునే పరిస్థితిల్లో లేరు . ఎక్కువ మంది సజ్జల చెప్పిన మాటలే వింటారు. జగన్ వద్దకు యాక్సెస్ లేకపోవడం.. సజ్జల వల్లే అన్ని పదవులు రావడంతో అందరూ సజ్జలకు ఎక్కువగా టచ్లో ఉంటున్నారు. ఈ కారణంగా ఆయనను దూరం పెట్టకపోయినా… సమావేశాలకు పిలుస్తున్నారు. కానీ మీడియా సమావేశాలకు దూరంగా ఉండాలని.. ఎవరూ మాట్లాడకపోయినా పర్వాలేదని జగన్ అన్నట్లుగా చెబుతున్నారు. అందుకే.. ఎమ్మెల్సీలు, ఎంపీలు , పార్టీ నేతలతో సమావేశాల తర్వాత ప్రెస్ నోట్లు విడుదల చేస్తున్నారు కానీ… ఎవరూ మీడియాతో మాట్లాడటం లేదు.