Salary Hike: ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారికి భారీగా జీతాలు పెంచిన ప్రభుత్వం!

www.mannamweb.com


Andhra Pradesh Govt: కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంగా చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పలు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది.
అందులో భాగంగానే పలు శాఖలు, విభాగాల్లో ప్రజల అవసరాలకు సంబంధించిన అన్నింట్లోనూ మార్పులు చేర్పులు చేస్తోంది. తాజాగా ప్రజారోగ్యానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.

వైద్య ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ఇకపై 108, 104 సేవలను ఒక్కే సర్వీస్ ప్రొవైడర్ ద్వారా అందించనున్నట్టు నిర్ణయించారు. 190 కొత్త 108 అంబులెన్స్ వాహనాల కొనుగోలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 108 అంబులెన్స్ సిబ్బంది, డ్రైవర్లకు అదనంగా రూ. 4,000 ఇస్తారు. అలాగే, కొత్తగా 58 మహాప్రస్థానం వాహనాలు అందుబాటులోకి రానున్నాయి.

ప్రతి మండలంలో జన ఔషధి స్టోర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రివెంటివ్ హెల్త్ కేర్‌కు ప్రాధాన్యం ఇచ్చేందుకు వైద్య శాఖ ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు. ఈ సమావేశంలో వైద్య శాఖలో పెండింగ్‌లో ఉన్న సమస్యలు, చేపట్టదలచిన సంస్కరణలపై కూడా చర్చ జరిగింది. మంత్రి సత్య కుమార్‌తో పాటు, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.