Kirana Stores: దేశంలో జనాభాకు తగిన స్థాయిలో వైద్య వ్యవస్థలు అందుబాటులో లేని సంగతి తెలిసిందే. ఇలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం మందుల విక్రయానికి సంబంధించి కొత్త ప్లాన్‌తో ముందుకొస్తోంది.
జలుబు నుంచి తలనొప్పి వరకు ఏ చిన్న సమస్య ఉన్నా.. దానికి అవసరమైన మందులు కావాలంటే మెడికల్ షాప్ కు వెళ్లాల్సిందే. అయితే అర్థరాత్రి అకస్మాత్తుగా మందులు కావాలంటే చాలా గ్రామాల్లో పక్కన ఉండే ఊరు లేదా టౌన్లకు వెళ్లటం అసాధ్యం. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్ చొరవ తీసుకుంటోంది.
త్వరలో కిరాణా షాపుల్లో వైద్యుల ప్రిస్క్రిప్షన్ స్లిప్పులు లేని జనరిక్ మందులు విక్రయానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా లభించే మందులను దీనికింద విక్రయానికి అందుబాటులో ఉంచాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. పెయిన్ రిలీఫ్, కోల్డ్ వంటి మందులను సాధారణ కిరాణా దుకాణాల్లో కూడా అందుబాటులో ఉంచేలా నిబంధనలను మార్చటంపై కేంద్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఈ విషయంలో జలుబు, దగ్గు, యాంటాసిడ్ మందులను సాధారణ దుకాణాల్లోనే అందుబాటులో ఉంచడం వల్ల కలిగే లాభనష్టాలపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ అధ్యయనం చేస్తోంది.
భారతదేశంలో మందులను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పేరుతో మాత్రమే పంపిణీ చేయాలనే నిబంధనలు ఉన్నప్పటికీ.. కొన్ని మందులను కౌంటర్లో విక్రయిస్తారు. కానీ ఈ విధంగా ఏ మందులు అనుమతించబడతాయో జాబితా స్పష్టంగా లేదు. అందువల్ల దీన్ని సులభతరం చేసే బాధ్యతను నిపుణుల కమిటీకి కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అతుల్ గోయల్ ఏర్పాటు చేసిన కమిటీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో దీని ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై అధ్యయనం చేస్తోంది. ఈ కమిటీ సూచన మేరకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఇప్పటికే అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలో ప్రజలు సాధారణ కిరాణా దుకాణాల్లో కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా జనరిక్ మందులను కొనుగోలు చేయవచ్చు. వాటికి సరైన నియమనిబంధనలు ఉన్నాయి. ఆ విధంగా దగ్గరలో ఉన్న చిన్న కిరాణా షాపుల నుంచి కూడా మందుల షాపులకు వెళ్లకుండా.. మన దేశంలో కూడా సాధారణంగా ఉపయోగించే మందులను కొనుగోలుకు వీలు కల్పిచేలా కేంద్ర ప్రభుత్వం సవరణలను తీసుకురావాలని భావిస్తోంది. భవిశా లోక్ సభ ఎన్నికల తర్వాత దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.