సాధారణ ఉప్పుకు బదులుగా కొన్ని ప్రత్యామ్నాయాలు వాడితే, హై బీపీ రిస్క్ 40శాతం వరకు తగ్గుతుందని తాజా అధ్యయనం గుర్తించింది.
భారతదేశంలో ఏ వంటైనా ఉప్పు లేకుండా పూర్తి కాదు. ఇతర ఇంగ్రీడియంట్స్ ఎన్ని ఉన్నా, ఉప్పు లేకపోతే ఆహార పదార్థాలు రుచించవు. మన దేశంలో ఉప్పు వాడకం తప్పనిసరిగా మారిపోయింది. కాకపోతే అది మోతాదును మించిపోతుండటమే ఆందోళనకరం. ఒక మనిషి రోజుకు గరిష్ఠంగా 5 గ్రాముల ఉప్పు తీసుకోవాలన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన. కానీ భారతీయులు రోజూ సగటున 8 గ్రాముల ఉప్పు తీసుకుంటున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఉప్పుకు బదులుగా కొన్ని ప్రత్యామ్నాయాలు వాడితే, హై బీపీ రిస్క్ 40శాతం వరకు తగ్గుతుందని తాజా అధ్యయనం గుర్తించింది.
ఉప్పు ఎక్కువగా తీసుకుంటే తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవు. అయితే పొటాషియం అధికంగా ఉండే సాల్ట్ ప్రత్యామ్నాయాలను వినియోగించడం వల్ల వృద్ధుల్లో అధిక రక్తపోటు (High Blood Pressure) ప్రమాదం తగ్గుతుందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. హైబీపీ గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి తీవ్రమైన పరిస్థితుల ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే రక్తపోటును మేనేజ్ చేయడానికి ఆహారంలో సోడియం సాల్ట్ తీసుకోవడం తగ్గించాలని, దీనికి బదులుగా పొటాషియం అధికంగా ఉండే సాల్డ్ ఆల్టర్నేటివ్స్ వాడాలని తాజా అధ్యయనం సూచిస్తోంది.
ప్రత్యామ్నాయాలు ఏవి?
సాధారణ ఉప్పు కంటే, సాల్ట్ ఆల్టర్నేటివ్స్‌లో తక్కువ సోడియం క్లోరైడ్ ఉంటుంది. దీంట్లో పొటాషియం క్లోరైడ్ కూడా ఉంటుంది. ఇది రక్తపోటును పెంచదు. పుట్టగొడుగులు, నిమ్మకాయ, సీవీడ్, హౌథ్రోన్, వైల్డ్ జుజుబ్ వంటి ఫ్లేవరింగ్స్.. ఉప్పు రుచి లేని లోటును తీరుస్తాయి. వీటిని సాల్ట్‌కు బదులుగా వినియోగించవచ్చు.
అధ్యయనం వివరాలు
ఈ అధ్యయనంలో చైనాలో లాంగ్‌టర్మ్ కేర్ ఫెసిలిటీస్‌లో ఉంటున్ 55 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల 611 మంది పెద్దలు పాల్గొన్నారు. వారిని రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూపు సాధారణ సాల్ట్ ఉపయోగించింది. మరొకటి గ్రూప్ సాల్ట్ ప్రత్యామ్నాయాలు తీసుకుంది.
అధ్యయనం ఫలితాలు
రెండు సంవత్సరాల తర్వాత పరిశీలిస్తే, సాధారణ ఉప్పు వాడే గ్రూపుతో పోలిస్తే సాల్ట్ ఆల్టర్నేటివ్స్ ఉపయోగించే గ్రూప్‌లో అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం 40% తక్కువగా ఉంది. ముఖ్యంగా సాల్ట్ ప్రత్యామ్నాయాలు ఉపయోగించే వారు తక్కువ రక్తపోటు(Low Blood Pressure) సమస్యలను ఎదుర్కోలేదు. లో బీపీ కూడా చాలా ప్రమాదకరం. ఇది ముఖ్యంగా వృద్ధులను తీవ్ర అనారోగ్యాల పాలు చేస్తుంది.
ఆహారంలో సాల్ట్ ప్రత్యామ్నాయాలను చేర్చడం వల్ల తక్కువ రక్తపోటు ప్రమాదాన్ని పెంచకుండా అధిక రక్తపోటు, సంబంధిత హృదయ సంబంధ వ్యాధులను నివారించవచ్చని ఈ అధ్యయనం సూచిస్తుంది. ఇది వృద్ధులకు, ఇప్పటికే అధిక రక్తపోటుతో పోరాడుతున్న వారికి ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది.
పరిమితులు, తదుపరి పరిశోధన
పరిశోధనలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, సాల్ట్ ప్రత్యామ్నాయాల ప్రయోజనాలను పూర్తిగా అర్థం చేసుకోవడానికి మరింత పరిశోధన అవసరం. ప్రత్యేకించి ఇప్పటికే అధిక రక్తపోటు ఉన్నవారి విషయంలో మరింత స్పష్టత రావాల్సి ఉంది. మిస్సింగ్ డేటా వంటి కొన్ని లిమిటేషన్లు కూడా ఉన్నాయి. అయితే ఫలితాలు సాల్ట్ ఆల్టర్నేటివ్స్‌పై గతంలో జరిగిన పరిశోధనల ఫలితాలకు సమానంగా ఉంటాయి.
ఉప్పు తీసుకోవడం తగ్గించడానికి ఇతర మార్గాలు
ఆహారంలో సోడియంను తగ్గించడానికి సాల్ట్ ప్రత్యామ్నాయాలు మాత్రమే ఎంపిక కాదు. ఇతర మార్గాలు కూడా మేలు చేస్తాయి. తక్కువ సోడియం ఉన్న ప్రొడక్ట్స్ ఎంచుకోండి. రెడ్యూజ్డ్ సోడియం మసాలాలు, డ్రెస్సింగ్‌లను ఎంచుకోండి. లేదా ఇంట్లో తయారుచేసిన వాటిని వినియోగించండి. ఉప్పు లేకుండా ప్యాక్ చేసిన, ఫ్రోజెన్ వెజిటెబుల్స్ కొనండి. ఉప్పు లేకపోయినా రుచి బాగుండటానికి హెర్బ్స్, సుగంధ ద్రవ్యాలు, సిట్రస్ వంటి సువాసనగల పదార్థాలను ఉపయోగించండి. అవసరమైతే సాస్‌లను వినియోగించండి.