ఇద్దరూ సచివాలయంలో ఒకే విభాగానికి ఇన్‌చార్జ్‌గా ఉన్నారు.

భార్యాభర్తలిద్దరూ ఐఏఎస్‌లు ఉండటం సహజమే.. కానీ ఒకే శాఖలో పని చేస్తూ భర్త ఆర్డర్స్ ఇవ్వడం, వాటిని భార్య అమలు చేయడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి.


చాలా కాలంగా ఎలాంటి పోస్టింగ్ లేకుండా వెయిటింగ్‌లో ఉన్న డాక్టర్ యోగితారాణాకు ఈ మధ్యే విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా పోస్టింగ్ ఇచ్చారు. ఆమె ఆ శాఖలోని లోటు పాట్లను అర్థం చేసుకునేందుకు అధికారులతో వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఆమె భర్త అయిన మాణిక్‌రాజ్ సీఎంఓలో విద్యాశాఖ సెక్రెటరీగా పని చేస్తున్నారు. ప్రిన్సిపల్ సెక్రెటరీ హోదాలో తీసుకునే నిర్ణయాల్లో ఏమైన లోటుపాట్లు ఉంటే సీఎం సెక్రెటరీలుగా పని చేస్తున్న ఆఫీసర్లు వాటిని సరిదిద్దుతూ ఉంటారు. అదే విధంగా వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీలు సీఎం ఆమోదం కోసం పంపే ఫైల్స్‌లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే సీఎం కార్యదర్శలు వెంటనే సంబంధిత సెక్రెటరీలకు ఫోన్ చేసి క్లారిఫికేషన్ తీసుకుంటుంటారు.

సీఎం కార్యదర్శుల నుంచి ఫోన్ వస్తే బాధ్యతగా సంబంధిత సెక్రెటరీలు ఫోన్ అటెండ్ చేసి, కావాల్సిన వివరాలు ఇస్తుంటారు. మరింత ముఖ్యమైన ఫైల్స్ ఉంటే ఇద్దరు కూర్చొని డిస్కషన్ చేస్తుంటారు. అయితే భార్యభర్తలుగా ఉన్న ఐఏఎస్‌లు యోగితారాణా, మాణిక్‌రాజ్ విద్యాశాఖ బాధ్యతలు చూస్తున్న క్రమంలో ఇద్దరి మధ్య అడ్మినిస్ట్రేషన్ రెస్పాన్స్‌బిలిటీ ఉంటుందా? ప్రిన్సిపల్ సెక్రెటరీ తీసుకునే నిర్ణయాల్లో పొరపాట్లు ఉంటే మాణిక్‌రాజ్ సరిచేసేనా? అనే డిస్కషన్ ఐఏఎస్ వర్గాల్లో ఉన్నది. అయితే ఇలాంటి సమస్యలు వస్తాయనే గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి త్వరలో తన సెక్రెటరీగా ఉన్న మాణిక్‌రాజ్ వద్ద ఉన్న ఎడ్యుకేషన్ సబ్జెక్ట్‌ను ఇతరులకు కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది.