Lok Sabha Election 2024: ఒకే వీధి.. తండ్రిది ఏపీ.. కొడుకుది తెలంగాణ!

www.mannamweb.com


Lok Sabha Election 2024: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఖమ్మం జిల్లా భద్రాచలంలోని రాజుపేటలో శీలం శ్రీనివాస్‌ ఇల్లు కట్టుకున్నాడు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దీంతో రాజుపేటలో వీధికి ఒకవైపు తెలంగాణలోని మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం, మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని అరకు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వెళ్లాయి. దీంతో శ్రీనివాస్‌ ఇల్లు ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోక్‌సభ స్థానం, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి చేరింది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం ఈ గ్రామం నుంచి 270 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

కొడుకు ఇళ్లు తెలంగాణలో..
ఇక శ్రీనివాస్‌ కొడుకు జనకీరామ్‌ అదే వీధిలో రోడ్డుకు మరోవైపు స్థలం కొనుగోలు చేసి ఇల్లు కట్టుకున్నాడు. ఆ ప్రాంతం తెలంగాణ పరిధిలో ఉంది. దీంతో ఇప్పుడు తండ్రి ఇల్లు ఆంధ్రప్రదేశ్‌లో, కొడుకు జానకీరామ్‌ ఇల్లు తెలంగాణ పరిధిలోకి వచ్చింది.

తండ్రి ఓటు అటు.. కొడుకు ఓటు ఇటు..
ఇక ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ, ఏపీలో మే 13న ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణలో మహబూబాబాద్‌లోక్‌సభ స్థానానికి, ఏపీలో అరకు లోక్‌సభ స్థానంతోపాటు రంపచోడవరం అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి. కొడుకు కుంటుంబం తెలంగాణలోని లోక్‌సభ స్థానానికి ఓటు వేయనుండగా, తండ్రి శ్రీనివాస్, అతని భార్య మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోని అరకు లోక్‌సభ, రంపచోడవరం అసెంబ్లీకి ఓటు వేయనున్నారు.

జిల్లా తెలంగాణలోనే..
ఇవన్నీ ఇలా ఉంటే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాత్రం తెలంగాణలో ఉంది. భూభాగం పరంగా తెలంగాణలో ఉన్నా.. లోక్‌సభ స్థానాల ఏర్పాటు నేపథ్యంలో ఈ విచిత్ర పరిస్థితి నెలకొంది. 2026 లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత వీటి పరిధి మారే అవకాశం ఉంది.