చంద్రబాబును కలిసేందుకు సంజయ్‌, పీఎస్‌ఆర్‌, కొల్లి రఘురామిరెడ్డికి అనుమతి నిరాకరణ

www.mannamweb.com


అమరావతి: తెదేపా అధినేత, కాబోయే సీఎం చంద్రబాబును కలిసేందుకు యత్నించిన వివాదాస్పద ఐపీఎస్‌ అధికారులకు అనుమతి నిరాకరించారు. మర్యాదపూర్వక భేటీ పేరుతో రాగా పోలీసులు అడ్డుకున్నారు.

చంద్రబాబును కలిసేందుకు సీఐడీ చీఫ్‌ సంజయ్‌ యత్నించారు. కరకట్ట గేటు వద్దే కానిస్టేబుళ్లు ఆయన కారును ఆపి వెనక్కి పంపారు. చంద్రబాబుపై అక్రమ కేసుల నమోదులో సంజయ్‌ కీలకంగా వ్యవహరించారు. ఎన్నికల ఫలితాలు రాగానే విదేశాలకు వెళ్లేందుకు సెలవు పెట్టారు. అది కూడా రద్దయినట్లు సమాచారం. మర్యాదపూర్వక భేటీ పేరుతో సంజయ్‌ వచ్చిన విషయాన్ని అధికారులకు గేటు సిబ్బంది చెప్పారు. అనుమతి లేదని చెప్పడంతో ఆయన కారును వెనక్కి పంపారు.

ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు గురువారం ఉదయం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్దకు చేరుకోగా అనుమతి లేదని చెప్పారు. ఎన్నికల విధుల్లో అవకతవకలకు పాల్పడ్డారని ఆయన్ను ఎన్నికల సంఘం (ఈసీ) తప్పించింది. ఆ తర్వాత అనధికారికంగా కూడా వైకాపా కోసం పనిచేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నివాసానికి వెళ్లే మార్గంలో ప్రధాన గేటు వద్దే కానిస్టేబుళ్లు పీఎస్‌ఆర్‌ కారును ఆపారు. లోపలికి అనుమతి లేదని స్పష్టం చేశారు. దీంతో చేసేదేమీ లేక ఆయన వెనుదిరిగారు.

మరో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి కొల్లి రఘురామిరెడ్డికి అనుమతి నిరాకరించారు. చంద్రబాబును కలిసేందుకు ఫోన్‌లో అధికారులను ఆయన అనుమతి కోరగా తిరస్కరించారు. నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్‌ చేసే సమయంలో రఘురామిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఎన్నికల సమయంలో వైకాపాకు విధేయుడిగా ఉన్నారంటూ ఈసీ ఆయనపై కొరడా ఝుళిపించింది. డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశించింది.

గుంటూరు కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డికీ ఈ పరిస్థితే ఎదురైంది. వైకాపా ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరించారనే విమర్శలు ఆయనపై ఉన్నాయి. చంద్రబాబును కలిసేందుకు వెళ్లగా అనుమతి లేదని గేటు వద్దే పోలీసులు ఆయన కారును ఆపారు. దీంతో వేణుగోపాల్‌రెడ్డి వెనుదిరిగారు.