Sasaram Railway Station ఇలాంటి రైల్వే స్టేషన్ దేశంలో ఇదొక్కటే..
ఇది బీహార్ లోని ససారం రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ ఫోటో. ఇది విపరీతంగా వైరల్ అవుతున్న ఫోటొ. ఈ స్టేషన్ లో భారీ సంఖ్యలో విద్యార్థులు సీరియస్ గా చదువుకుంటూ ఉండటం, చర్చించుకుంటూ ఉండటం కనిపిస్తుంది. ఇదొక అసాధారణ పరిస్థితి. రైలు వచ్చే ముందు లేదా పోయే ముందు జనం గుంపు ఉండటం చూశాం కానీ ఇలా తిష్ట వేసి కూర్చుని సీరియస్ గా చదువుకుంటూ ఉండటం ఎక్కడా చూడం. అదే వింత. అందుకే ఫోటో వైరలవుతూ ఉంది. సాధారణంగా ఇలాంటి దృశ్యాలు రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాం మీద కనిపించవు. పరీక్షలపుడు ఒకరిద్దరు పుస్తకం చదువుతూ రైలుకోసం ఎదుచూస్తూండం కనిపిస్తుంది. అయితే, ససారం స్టేషన్ లో కనిపిస్తున్నది అరుదైన దృశ్యం. సాధారణంగా యూనివర్శీటీ క్యాంపస్ లలో ఇలాంటి దృశ్యం కనిపిస్తుంది.
ఇంతకీ అక్కడేం జరుగుతూ ఉంది?
ఈ మధ్య కాలంలో ‘ససారం’ బాగా పాపులర్ అయిన మాట. పోటీ పరీక్షలు రాసే వాళ్లకు, రాజకీయ పరిణమాలు గమనిస్తూన్న వాళ్లకు బాగ పరిచయమున్న మాట. ఇదొక పార్లమెంటు నియోజకవర్గం. బాబు జగ్జీవన్ రామ్ (ఏప్రిల్ 5, 1908- జూలై 6,1986) ఇక్కడి నుంచే పోటీ చేసే వారు. ఆయన ఆ ప్రాంతంలో తిరుగులేని నాయకుడు. బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో బాబూ జగ్జీవన్ రామ్ రక్షణ మంత్రిగా ఉన్నారు. తర్వాత ఉప ప్రధాని అయ్యారు. ఒక దశలో ప్రధాని పదవికి కూడా ఆయన పేరు వినిపించింది. అంతకంటే ముఖ్యంగా ఆయన జవహర్ లాల్ నెహ్రూ ప్రొవిజినల్ ప్రభుత్వంలో, తర్వాత క్యాబినెట్ లో కార్మిక మంత్రి అయ్యారు. ఇందిరా గాంధీ హయాంలో కాంగ్రెస్ వదిలేసి జనతా పార్టీలో చేరారు. ప్రతి ఎన్నికలో ఆయన రికార్డు మెజారిటీతోనే గెలిచేవారు. అందుకే ససారం అంతర్జాతీయ వార్త అయ్యేది. ఆయనకు పోలయిన ఓట్లను ఎంచడం కష్టం, తూకం వేయాల్సిందే అనే జోక్ చేసే వారు. ఉదాహరణకు 1971 పార్లమెంటు ఎన్నికలో పోలయిన 314,201 ఓట్లలో జగ్జీవన్ రామ్ కు 210,353 ఓట్లొచ్చాయి.
చరిత్ర విద్యార్థులకు కూడా ససారం పేరు బాగా తెలిసే ఉంటుంది. షేర్ షా సూరి చక్రవర్తి పేరు విన్నారు కదా!. 1530-1540 మధ్య మొగల్ సామ్రాజ్యాన్ని అక్రమించి సూరి రాజ్యాన్ని స్థాపించిన ఆఫ్గన్ దేశస్తుడు షేర్ షా సూరి. ఆయన రాజధాని ససారం. ఇక్కడ ఇప్పటికీ ఆయన సమాధి (కింది ఫోటో) ఉంది. ఇది శిధిలావస్థలో ఉంటుంది. భారతదేశంలో రుపాయ కరెన్సీ ప్రవేశపెట్టింది షర్ షా సూరియే.
గతమెంతొ ఘనకీర్తి ఉన్నాససారం ఎన్నికలపుడు తప్ప మరొకపుడు వినిపించని పేరు. చిత్రంగా ఈ ఫోటోతో మరొక సారి ససారం పెద్ద వార్తయింది.
ఇంతకీ విద్యార్థులెవరు?
ఫోటోలో కనిపిస్తున్న వాళ్లంతా రకరకాల సివిల్ సర్వీసెస్, బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు. ప్రతిరోజు వీరితో రైల్వే స్టేషన్ లోని ఒక మూల 1, 2 ప్లాట్ ఫామ్ లు ఇలా రెండు గంటల పాటు రద్దీగా తయారవుతాయి . వందల సంఖ్యలో విద్యార్థులు యమ బిజీగా కనిపిస్తారు. రైల్వే స్టేషన్ లో ఏం జరుగుతున్నదో కూడా పట్టించుకోకుండా పుస్తకాల్లో దూరో, చర్చల్లో మునిగో కనిపిస్తారు. ససారం చుట్టుపక్కల పల్లెలనుంచి పట్టణాలనుంచి వందల సంఖ్యలో ఇలాస్టేషన్ కు వస్తారు. చీకటి పడితే కరెంటు స్తంబాల లైట్ల వెలుగులో చదువుకుంటారు. పొద్దున పూట ప్లాట్ ఫారం మొత్తం వీల్లే కనబడతారు.
కారణం, ఈ ప్రాంతం నుంచి పోటీ పరీక్షలలో పాసయిన వారు, పాస్ కాకపోయినా పరీక్షలు రాసి అనుభవం సంపాదించిన వాళ్లు ఇక్కడి వచ్చి ఔత్సాహికులకు శిక్షణ ఇవ్వడం. ఇది ఇలాంటి ఔదార్యానికి చాలా పేరు. సీనియర్లు జూనియర్లకు సహకరించడం బీహార్ సంప్రదాయమేమో అనిపిస్తుంది. ఆనంద్ కుమార్ సూపర్ 30 ఐఐటి కోచింగ్ తెలుసు కదా. ససారం పరిసరాలు మావోయిస్టు రాజకీయాల ప్రభావం ఉన్న గ్రామాలు. బీహార్ లో బాగా వెనకబడిన ప్రాంతం. ససారం చరిత్ర గొప్పది గాని, వర్తమానం దుమ్ము గొట్టుకు పోతున్నది. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకుంటే చాలు, జీవితం ప్రశాంతంగా సాగుతుందని ఇక్కడ ప్రజల్లో నమ్మకం. అందుకే ఈ పిల్లలు ప్రభుత్వోద్యోగాల పోటీ పరీక్షలకు సీరియస్ ప్రిపేర్ అవుతుంటారు. వీళ్లందరికి ససారం స్టేషన్ హబ్ గా మారింది.
2002-2003 లో ఒక అరడజన్ మంది విద్యార్థులతో ఇది మొదలయింది. ఒక దశలో 1200 మంది విద్యార్థుల దాకా చేరింది. వీరంతా స్టేషన్ కే ఎందుకొస్తున్నారు? తమ వూర్లలో రాత్రిళ్లు చదువుకునేందుకు వీలుండదు. కరెంటు సదుపాయం లేకపోవడం, ఉన్నా ఎపుడొస్తుందో ఎపుడు పోతుందో తెలియని పరిస్థితి. రైల్వే స్టేషన్ లో 24X7 కరెంటు అందుబాటులో ఉంటుంది. అందువల్ల రాత్రి పొద్దుపోయే దాకా చదువుకునేందుకు, తెల్లవారుజామున లేచి చదువుకునేందుకు ఇక్కడ అనుకూలంగా ఉంటుంది. అందువల్ల వీరంతా స్టేషన్ ని కోచింగ్ సెంటర్ గా స్టడీ సెంటర్ గా చేసుకున్నారు.
పోటీ పరీక్షల్లో నెగ్గేందుకు ఈ విద్యార్థుల పడుతున్న శ్రమ చూసి రైల్వే శాఖ సహకారం అందించింది. వీరిలో చాలా మందికి పాస్ లు అందించింది. అంటే వీళ్ల దగ్గిర ప్లాట్ ఫామ్ లేదన్న భయం అవసరం లేదు. వీళ్లు మీద ఈ ప్లాట్ ఫాం మీద ఎంతసేపయిన ఉండవచ్చు. కొంత మంది విద్యార్థులు పొద్దున రెండు గంటలు కోచింగ్ తీసుకు తమ వూర్లకు వెళ్లిపోతే, కొందరేమో స్టేషన్ లో దినమంతా ఉండి చదువుకుని సాయంకాలం వెళ్లిపోతారు. మరికొందరు స్టేషన్ సమీపంలో ససారంలోనే గదులు అద్దెకు తీసుకున్నారు. వాళ్లు నిద్రపోయేందుకు మాత్రం రూమ్ కు వెళతారు. ప్రిపరేషనంతా ప్లాట్ ఫాం మీదే.