Sasikala: సమయం వచ్చేసింది.. నా ప్రవేశం ప్రారంభమైంది.. శశికళ కీలక వ్యాఖ్యలు

Sasikala: తమిళనాడు రాజకీయాల్లోకి తన ప్రవేశం ప్రారంభమైందని దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ అన్నారు. అన్నాడీఎంకేను ఏకతాటిపైకి తీసుకొస్తానని ప్రకటించారు.


చెన్నై: తాజా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఇక అన్నాడీఎంకే (AIADMK) పనైపోయిందని భావించొద్దని తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ (Sasikala) అన్నారు. పార్టీలోకి తన ప్రవేశం ప్రారంభమైందని.. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది ‘అమ్మ పాలన’ను తిరిగి తీసుకొస్తామంటూ ఆదివారం ఆమె కీలక ప్రకటన చేశారు.

ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఎడప్పాడి కె.పళనిస్వామి.. ప్రభుత్వాన్ని నిలదీయలేకపోతున్నారని శశికళ (Sasikala) ఆరోపించారు. ఇకపై తానే అధికార పక్షాన్ని ప్రశ్నిస్తానని చెప్పారు. పార్టీపై పట్టు కోసం గతంలో ఆమె విఫలయత్నం చేసిన విషయం తెలిసిందే. తిరిగి ప్రవేశించేందుకు సమయం ఆసన్నమైందని కార్యకర్తలతో జరిగిన సమావేశంలో తాజాగా ఆమె వ్యాఖ్యానించారు. పార్టీని ఏకతాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు. ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు. ‘‘తమిళ ప్రజలు మనతో ఉన్నారు. నేను చాలా నమ్మకంతో ఉన్నాను. నా ప్రవేశం ప్రారంభమైంది. నేను ఇప్పటివరకూ చెబుతూ వచ్చిన సమయం వచ్చేసింది. అన్నాడీఎంకే పనైపోయిందనుకోవద్దు’’ అని అన్నారు.

త్వరలోనే తాను రాష్ట్రవ్యాప్త పర్యటన చేపట్టి డీఎంకే పాలనను ఎండగడతానని శశికళ చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ మూడు, నాలుగు స్థానాలకు పడిపోవడంపై విచారం వ్యక్తంచేశారు. కొన్ని స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కలేదని వాపోయారు. త్వరలో అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తానని ధీమా వ్యక్తంచేశారు. తద్వారా అధికారాన్ని సొంతం చేసుకుంటామని పేర్కొన్నారు.

జయలలిత మరణానంతరం జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే (AIADMK) వరుస ఓటములు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇందుకు కారణం పార్టీలో నెలకొన్న వర్గపోరే అని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. దీంతో పన్నీర్‌ సెల్వం, పళనిస్వామి ద్వంద్వ నాయకత్వాన్ని మార్చాలన్న డిమాండ్‌ అధికమైంది. ఈ తరుణంలో శశికళ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. జయలలిత మరణం తర్వాత చోటుచేసుకున్న పరిణామాల్లో పార్టీకి దూరమైన ఆమె.. సమీప బంధువు టీటీవీ దినకరణ్‌తో కలిసి ‘అమ్మ మక్కళ్ మున్నేట్ర కజగం (AMMK)’ పార్టీని స్థాపించారు. ఈనేపథ్యంలో ఏఎంఎంకేతో పాటు శశికళ తిరిగి పార్టీలో చేరితే తప్ప అన్నాడీఎంకే విజయం సాధించటం సాధ్యం కాదని కార్యకర్తలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.