కొత్త కారు కొనాలనుకుంటున్నారా? పెట్రోల్ ఖర్చు పెరుగుతోందని ఆందోళన చెందుతున్నారా? అయితే మీకో శుభవార్త. నిస్సాన్ (Nissan) కంపెనీ తమ మాగ్నైట్ (Magnite) కారుకు CNG రెట్రోఫిట్‌మెంట్ (Retrofitment) ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది.
దీనివల్ల సాధారణ పెట్రోల్ మాగ్నైట్ కారును కేవలం రూ.75 వేలు అదనంగా చెల్లించి CNG కారుగా మార్చుకోవచ్చు. ఈ రెట్రోఫిట్‌మెంట్ ఎక్కడ జరుగుతుంది? దీన్ని ఎలా చేయించుకోవాలి? వంటి పూర్తి వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.
నిస్సాన్ కంపెనీ ప్రస్తుతం మాగ్నైట్ (Magnite) కారును విక్రయిస్తోంది. ఈ కారు ప్రజల్లో మంచి పేరు సంపాదించుకుంది. ఈ కారుకు పోటీగా ఉన్న ఇతర కంపెనీలు తమ వాహనాల్లో CNG వేరియంట్‌లను ప్రవేశపెట్టి విక్రయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిస్సాన్ కంపెనీ ఈ CNG సెగ్మెంట్‌ను కూడా పట్టుకోవడానికి ఇప్పుడు ఒక కొత్త వ్యూహాన్ని అమలు చేసింది.
దీని ప్రకారం నిస్సాన్ మాగ్నైట్ కారును కొనుగోలు చేసే కస్టమర్లు కోరుకుంటే తమ కారుకు CNG రెట్రోఫిట్‌మెంట్‌ను అమర్చుకోవచ్చని కంపెనీ తెలిపింది. దీన్ని డీలర్‌షిప్ స్థాయిలో చేయడానికి కంపెనీ నిర్ణయించింది. మొదటి దశలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లోని డీలర్‌షిప్‌లలో మాత్రమే ఈ రెట్రోఫిట్‌మెంట్ అందుబాటులో ఉంటుంది. తదుపరి దశలో మరిన్ని రాష్ట్రాలకు కూడా దీన్ని విస్తరిస్తారు.
ఈ CNG రెట్రోఫిట్‌మెంట్ కోసం 3 సంవత్సరాలు లేదా ఒక లక్ష కి.మీ.ల వరకు వారంటీని అందిస్తున్నారు. ఈ రెట్రోఫిట్‌మెంట్ CNG కిట్ కాలుష్య నియంత్రణ, భద్రతా ప్రమాణాలన్నింటినీ తనిఖీ చేసి, పరీక్షించిన తర్వాతే అందిస్తారు. పెట్రోల్ ఖర్చును తగ్గించుకోవాలనుకునే కస్టమర్‌లకు మంచి ఆప్షన్‌ను అందించడానికి ఈ ఆప్షన్ తీసుకొచ్చారు.
ఈ ఆప్షన్ నిస్సాన్ మాగ్నైట్ కారులోని 1.0 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఉన్న వేరియంట్లకు మాత్రమే అమర్చబడుతుంది. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్‌లు, టర్బోఛార్జ్డ్ ఇంజిన్ ఉన్న వేరియంట్‌లలో ఈ CNG కిట్‌ను అమర్చలేరు. ఈ CNG కిట్ అమర్చినప్పుడు కారు లోపల లేదా బయట ఎటువంటి మార్పు ఉండదు. అయితే, లోపల CNG కోసం ఒక స్విచ్ మాత్రమే అమర్చబడుతుంది.
ఈ నిస్సాన్ మాగ్నైట్ కారు ప్రపంచవ్యాప్తంగా 65 దేశాలలో విక్రయించబడుతోంది. కుడివైపు స్టీరింగ్ వీల్ ఉన్న దేశాలు, ఎడమవైపు స్టీరింగ్ వీల్ ఉన్న దేశాలు.. ఈ రెండు వెర్షన్లలోనూ విక్రయించబడుతుంది. ఈ కారు భారతదేశంలో టాటా పంచ్ CNG(Tata Punch CNG), హ్యుందాయ్ ఎక్స్‌టర్ CNG(Hyundai Exter Exter CNG) కార్లతో నేరుగా పోటీ పడుతుంది. ఈ కారు భారతదేశంలో రూ.6.89లక్షల నుండి రూ.10.02లక్షల ధరల మధ్య అమ్ముడవుతోంది.
రెనాల్ట్ (Renault) కంపెనీ ఇప్పటికే గత ఫిబ్రవరి నెలలో తమ క్విడ్ (Kwid), కైగర్ (Kiger), ట్రైబర్ (Triber) కార్లకు ఇలాంటి CNG రెట్రోఫిట్‌మెంట్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు నిస్సాన్ మాగ్నైట్ కారుకు కూడా దీన్ని ప్రవేశపెట్టారు. రెనాల్ట్ , నిస్సాన్ కంపెనీలు కలిసి వాహనాలను తయారు చేస్తాయి. ఇవి రెండూ ఒకే టెక్నాలజీని ఉపయోగిస్తాయి. అయితే బ్రాండ్ పేరు, వేర్వేరు పేర్లతో విక్రయించబడుతున్నాయి.
































