ప్రభుత్వరంగానికి చెందిన బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రెండు కొత్త డిపాజిట్ స్కీమ్‌లను తీసుకొచ్చింది. హర్ ఘర్ లఖ్‌పతి (Har Ghar Lakhpati), ఎస్‌బీఐ ప్యాట్రాన్స్ (Patrons) పేరుతో వీటిని తీసుకొచ్చింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. హర్‌ఘర్ లఖ్‌పతి అనేది ప్రీ క్యాలుక్యులేటెడ్ రికరింగ్ డిపాజిట్ (RD) పథకం. రూ.1 లక్ష లేదా ఆపై రూ.లక్ష చొప్పున నిధులను సమకూర్చుకోవడానికి ఉద్దేశించిన పథకం ఇది. వ్యక్తులు తమ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని ఎస్‌బీఐ తెలిపింది. మైనర్లకూ ఈ పథకం అందుబాటులో ఉంటుందని పేర్కొంది.
ఎస్‌బీఐ ప్యాట్రన్స్ అనేది సీనియర్ సిటిజన్లకు ఉద్దేశించిన పథకం. 80 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు కలిగిన వారి కోసం ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని తీసుకొచ్చారు. వీరికి అధిక వడ్డీని అందిస్తామని బ్యాంక్ తెలిపింది. ప్రస్తుత, కొత్తగా ఎఫ్‌డీ చేసే వారికి ఈ పథకం అందుబాటులో ఉంటుందని పేర్కొంది. కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ డిపాజిట్ స్కీమ్‌లను తీసుకొచ్చినట్లు ఎస్‌బీఐ ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు. డిపాజిట్ల విషయంలో 23 శాతం మార్కెట్ వాటాతో ఎస్‌బీఐ అగ్రస్థానంలో ఉంది. ఎస్‌బీఐలో ప్రస్తుతం కనీసం 12 నెలల నుంచి గరిష్ఠంగా 120 నెలల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసుకునే సదుపాయం ఉంది.