AP Cabinet: రాష్ట్రం యూనిట్‌గా ఎస్సీ వర్గీకరణ

ఎస్సీ వర్గీకరణను 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన రాష్ట్రం యూనిట్‌గా అమలు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. వర్గీకరణను జిల్లా యూనిట్‌గా అమలు చేయాలని మొదట భావించింది. అయితే జిల్లాల విభజన తర్వాత కొత్త జిల్లాల్లో ఎస్సీల జనాభాపై కచ్చితమైన సమాచారం లేనందున రాష్ట్రం యూనిట్‌గా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. 2026 జనాభా గణన తర్వాత వర్గీకరణను జిల్లా యూనిట్‌గా అమలు చేసే విషయాన్ని పరిశీలించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఎస్సీ వర్గీకరణను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి అమలు చేయనున్నారు. ఏ- కేటగిరీలో రెల్లి, ఉపకులాలకు 1 శాతం రిజర్వేషన్‌.. బీ కేటగిరీలో మాదిగ, ఉపకులాలకు 6.5 శాతం.. సీ కేటగిరీలో మాల, ఉపకులాలకు 7.5 శాతం రిజర్వేషన్‌ను ప్రతిపాదిస్తూ రాజీవ్‌ రంజన్‌ మిశ్ర నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. విద్య, ఉద్యోగ నియామకాల్లో 200 రోస్టర్‌ పాయింట్లను ప్రతిపాదించింది. కమిషన్‌ నివేదికపై అధ్యయనానికి నియమించిన మంత్రుల సంఘం చేసిన సిఫారసుల్ని రాష్ట్ర మంత్రిమండలి సోమవారం ఆమోదించింది.


సుదీర్ఘ చర్చ తర్వాత..
వర్గీకరణ అమలుపై మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. హోం మంత్రి అనిత, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి అభిప్రాయాలను తీసుకున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల పెండింగ్, ఎస్సీ ఉపప్రణాళిక నిధుల కేటాయింపులో జాప్యం, తదితర అంశాలన్నింటినీ పరిశీలించిన తర్వాత ప్రస్తుతానికి రాష్ట్రం యూనిట్‌గా ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఏక సభ్య కమిషన్‌ నివేదికపై ఈ నెల 20న అసెంబ్లీలో చర్చించనున్నారు. బేడ, బుడగ జంగాలను రెల్లి కేటగిరీ కింద చేర్చే అంశంపై కూడా అదే రోజు చర్చిస్తారు. వీటిపై తీర్మానాలు చేసి, జాతీయ ఎస్సీ కమిషన్‌కు నివేదిస్తారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఆర్డినెన్స్‌ జారీ చేసే అవకాశముంది.

‘జిల్లా యూనిట్‌’కే ఎక్కువ మంది ఎమ్మెల్యేల మొగ్గు
ఎస్సీ వర్గీకరణ అమలుపై సోమవారం ఉదయం అసెంబ్లీ ఆవరణలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, చీఫ్‌ విప్‌ జీవీ ఆంజనేయులు ఎస్సీ ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. వారిలో ఎక్కువ మంది జిల్లా యూనిట్‌గా వర్గీకరణ అమలు చేయాలని కోరారు. సాయంత్రం మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబును ఎస్సీ ప్రజాప్రతినిధులు కలిసి అభినందించారు. వర్గీకరణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మీడియాతో చెప్పారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.