SC, ST reservation:ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు

www.mannamweb.com


ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై ఎన్నో ఏళ్ల నిరీక్షణకు సుప్రీంకోర్టు తెరదించింది. గురువారం దీనిపై విచారణ చేపట్టిన కోర్టు షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీ), షెడ్యూల్డు తెగల( ఎస్టీ)కు ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యలో వారికి కేటాయించిన రిజర్వేషన్లను వర్గీకరణ చేయడానికి ఆమోదం తెలుపుతూ చరిత్రాత్మక తీర్పును ఇచ్చింది. భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం 6:1 మెజారిటీతో ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ తప్పనిసరి అని, దీనిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ కీలక తీర్పు వెలువరించింది. అలాగే, ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం 2004లో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కనబెట్టింది.

విచారణ సందర్భంగా జస్టిస్ బేలా త్రివేది ఎస్సీ, ఎస్టీ ఉపవర్గీకరణ సాధ్యం కాదని తీర్పును వ్యతిరేకించారు. అయితే మిగిలిన న్యాయముర్తులు కోటాలో సబ్‌కోటా ఉండటం తప్పు కాదని, ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని వ్యాఖ్యానించారు. కోర్టు నిర్ణయంతో దేశ వ్యాప్తంగా ఎస్సీ సామాజిక వర్గం వారు సంబరాలు చేసుకుంటున్నారు.

కేసు విషయానికి వస్తే

ఎస్సీ , ఎస్టీ రిజ‌ర్వేష‌న్ల వ‌ర్గీక‌ర‌ణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2000-2004లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో బీజం పడింది. ఆ సమయంలో ఎస్సీ, ఎస్టీ వ‌ర్గీక‌ర‌ణను అమలు చేయగా, దానిని మాల‌మ‌హ‌నాడు తీవ్రంగా వ్యతిరేకించి హైకోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు వ‌ర్గీక‌ర‌ణకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అక్కడ కూడా వ‌ర్గీక‌రణకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. వెనుకబడిన వర్గాలలో మరింత అట్టడుగున ఉన్న వారిని ఒకే కేట‌గిరిలో ఉంచాల‌ని ఆదేశాలిస్తూ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు స‌మ‌ర్థించింది. దీంతో అప్పటి నుంచి ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి.

గతంలో పంజాబ్ ప్రభుత్వం, అక్కడి ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో వాల్మీకీలు, మఝాబీ సిక్కులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పంజాబ్, హరియాణా హైకోర్టు 2010లో రద్దు చేసింది. ఎస్సీ కేటగిరిలో వర్గీకరణ రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధమని 2004లో ‘ఈవీ చిన్నయ్య Vs ఆంధ్రప్రదేశ్’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా పంజాబ్ సర్కార్ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. దీంతో దీన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.

దీనిపై విచారణ చేపట్టిన ఐదుగురు జడ్జిల ధర్మాసనం ఈవీ చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుబట్టింది, తర్వాత 2020లో ఈ కేసును ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఫిబ్రవరిలో మూడు రోజుల పాటు వరుసగా విచారణ పూర్తి చేసింది, విచారణలో భాగంగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు తాము సానుకూలంగా ఉన్నట్టు కేంద్రం తెలిపింది. దీంతో పూర్తి వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ఫిబ్రవరి 8న తీర్పు రిజర్వ్ చేసింది. తాజాగా గురువారం చరిత్రాత్మక తీర్పును వెలువరించింది.