సర్కారు సొమ్ముకోసం ఉత్తుత్తి పెళ్లిళ్లు.. నకిలీ వధూవరులతో సామూహిక వివాహాలు.. కట్‌ చేస్తే..

నిరుపేద కుటుంబాల్లోని పిల్లల వివాహాలకు ఆర్ధిక సాయం అందించేందుకు గానూ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం కొందరు కేటుగాళ్లకు వరంగా మారింది. సామూహిక వివాహాల పేరుతో కొందరు అధికారులు చేతివాటాన్ని ప్రదర్శించారు.
ప్రభుత్వ పథకాన్ని పక్కదోవ పట్టించేందుకు దళారులతో కుమ్మక్కయ్యారు. ఇందుకోసం డబ్బులను ఎరగా వేసి నకిలీ వధూవరులను తయారు చేసి ఉత్తుత్తి పెళ్లిళ్లు జరిపించారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారడంతో ఈ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. వరుడు లేకుండానే వందలాది యువతులు తమ మెడల్లో తామే వరమాలలు వేసుకుని పెళ్లి చేసుకోవడం వీడియోల్లో కనిపించడంతో పోలీసులు అవాక్కయ్యారు. విస్తుగొలిపే ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలియా జిల్లాలో చోటుచేసుకుంది.


ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పేదల పెళ్లిళ్ల కోసం యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సామూహిక వివాహ వేడుక పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా పేదింటి యువతీ యువకులకు వివాహాలు జరిపించి.. ఆర్థికసాయం కింద 51,000 రూపాయలు అందజేస్తోంది. ఈ సొమ్మును కాజేసేందుకు దళారులతో కొంతమంది అధికారులు చేతులు కలిపారు. ఆ మేరకు జనవరి 25న బలియా జిల్లా మనియర్‌ పట్టణ కళాశాలలో నిర్వహించిన ప్రభుత్వ సామూహిక పెళ్లిళ్ల కార్యక్రమానికి నకిలీ వధూవరులను తీసుకువచ్చారు. అవివాహితులు, పెళ్లయిన యువతీ యువకులకు డబ్బు ఆశగా చూపించడంతో ఒప్పందం ప్రకారం వీరంతా ఉత్తుత్తి పెళ్లిళ్లు చేసుకున్నారని తెలిసింది.

వైరల్‌ అవుతున్న వీడియోల్లో ఎదురుగా వరుడు లేకుండా అమ్మాయిలు మెడలో కళ్యాణమాలను వేసుకుంటున్న దృశ్యాలు అందరినీ షాక్‌ అయ్యేలా చేశాయి.. దీంతో యూపీ సంక్షేమ శాఖ మంత్రి అసీమ్ అరుణ్ విచారణకు ఆదేశించారు. ఎనిమిది మంది అధికారులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. అయితే, ఈ నకిలీ పెళ్లిళ్లు చేసుకున్న వారికి ఇంకా నిధులు విడుదల చేయలేదని జిల్లా పాలనాధికారి రవీంద్ర కుమార్‌ తెలిపారు. సామూహిక వివాహ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో ఎనిమిదిమంది అనర్హులైన మహిళలు ఉన్నారని, వీరికి ఇది వరకే పెళ్లైందని ప్రాథమిక దర్యాప్తులో తెలింది. ఘటనకు సంబంధించి అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ సునీల్ కుమార్ యాదవ్‌ను సస్పెండ్ చేశారు.

అయితే, సామూహిక వివాహాల పథకం కింద పెళ్లి చేసుకునేందుకు అర్హులైన వారికి ముందుగా 51 వేలు చెల్లిస్తారు. ఇందులో అమ్మాయిలకు రూ.35 వేలు, పెళ్లి సామాగ్రి కొనుగోలుకు రూ.10 వేలు, కార్యక్రమానికి రూ.6 వేలు అందజేస్తారు. అయితే, ఈ నకిలీ పెళ్లిళ్లు చేసుకున్న వారికి ఇంకా నిధులు విడుదల చేయలేదని జిల్లా పాలనాధికారి రవీంద్ర కుమార్‌ తెలిపారు.