మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇవాళ మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్న క్రమంలో అప్రూవర్ గా మారిన వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరికి బెదిరింపులు ఎదురయ్యాయి.
ఇందులో పోలీసు అధికారులు కూడా ఉన్నారు. వీరితో పాటు ఇదే కేసులో ఓ ప్రధాన నిందితుడి కుమారుడు కూడా ఉన్నారు. వీరంతా గతంలో దస్తగిరిని బెదిరించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిపై దస్తగిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు.
అప్పట్లో దస్తగిరి వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారి నిందితుల పేర్లన్నీ బయటపెట్టి వాంగ్మూలాలు ఇస్తున్న క్రమంలో ఆయన బాధితుల ఒత్తిడి వల్లే అలా చేయాల్సి వచ్చిందని చెప్పమంటూ ఈ కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడైన డాక్టర్ చైతన్య రెడ్డి జైల్లో ఆయన్ను బెదిరించారు. అలాగే జైలు సూపరిండెంట్ ప్రకాష్, డీఎస్పీ నాగరాజు, సీఐ ఈశ్వరయ్య కూడా చైతన్య చెప్పినట్లు చేయాలని దస్తగిరిపై ఒత్తిడి తెచ్చారు. దీంతో వీరందరిపైనా దస్తగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే గతంలో దస్తగిరిపై తీవ్ర ఒత్తిళ్లు వచ్చినా ఆయన వెనక్కు తగ్గలేదు. జగన్ సహా పలువురు ఈ కేసులో తనను చంపే అవకాశం ఉందంటూ బహిరంగ వ్యాఖ్యలు కూడా చేసారు. అయితే దస్తగిరి ఫిర్యాదు చేసినా పోలీసులు మాత్రం కేసు నమోదు చేయలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో దస్తగిరి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ నలుగురిపై కేసులు నమోదు చేశారు. దీంతో ఈ కేసు మరో టర్నింగ్ తీసుకున్నట్లు అయింది.
అప్పట్లో మెడికల్ క్యాంప్ కోసం అంటూ జైలుకు వెళ్లిన చైతన్యరెడ్డి దస్తగిరిని తాను బెదిరించినట్లు వచ్చిన ఆరోపణల్ని తోసిపుచ్చారు. ఇదే అంశంపై సుప్రీంకోర్టు నోటీసులు కూడా ఇచ్చినా చైతన్య రెడ్డి మాత్రం ఇప్పటికీ తాను బెదిరించలేదనే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇప్పుడు చైతన్యరెడ్డిని అరెస్టు చేసి వాస్తవాలు నిగ్గు తేలుస్తారా లేదా చూడాల్సి ఉంది.
































