ఏపీ ప్రభుత్వం గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు ఇక నుంచి కచ్చితంగా సమయపాలన పాటించాల్సిందేనని ప్రభుత్వం చెప్పింది.
అంతేకాకుండా ఇక అటెండెన్స్ తప్పనిసరి చేసింది. సచివాలయ ఉద్యోగుల దగ్గర ఉండే అటెండన్స్ యాప్లో ఉదయం డ్యూటీకి వచ్చినపుడు ఒకసారి.. సాయంత్రం ముగించుకొని వెళ్తున్నప్పుడు మరోసారి తప్పని సరి అటెండన్స్ నమోదు చేయాలని అధికారులు చెబుతున్నారు.
ఈ మేరకు యాప్లో కొన్ని మార్పులు చేశారు. కొత్తగా GSWS అటెండన్స్ యాప్ వెర్షన్ 2.2.1 లో ఉదయం 10:30 లోపు మాత్రమే అటెండన్స్ తీసుకుంటుందని వివరించారు. అంతేకాదు సాయంత్రం 5 తర్వాత కచ్చితంగా బయోమెట్రిక్ వేయాల్సిందే. అప్పుడే ఫుల్ డే సాలరీ వస్తుందని ఎవరైనా ఉద్యోగి ఉదయం ఒకసారి అటెండెన్స్ వేసి సాయంత్రం వేయకపోతే ఆ రోజు CL గా పరిగణిస్తారని సమాచారం.
గత ప్రభుత్వ హయాంలో బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేశారు.. అది కూడా ఫేస్ రికగ్నైజ్డ్ అటెండెన్స్ కూడా ఉండేది. ఉదయం 9 గంటలకు ఒకసారి, మధ్యాహ్నం 2 గంటలకు రెండోసారి, సాయంత్రం 5 గంటలకు మూడోసారి హాజరువేయాలని అప్పటి ప్రభుత్వం ఉద్యోగులకు తెలిపింది. ఏకంగా మూడుసార్లు బయోమెట్రిక్ హాజరు అనడంతో సచివాలయ ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. కూటమి ప్రభుత్వం ఈ హాజరు విషయంలో మార్పులు చేసింది.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల అంటెండెన్స్ యాప్లో మధ్యాహ్నం 2.30 తరువాత వేసే స్లాట్ సమయాన్ని Disabledలో ఉంచారు. అంటే ఇక గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు మధ్యాహ్నం హాజరు వేయాల్సిన పని లేదు. కొత్తగా వచ్చిన మొబైల్ యాప్లో అప్డేట్ ఇచ్చారు. ఇకపై అటెండెన్స్ కేవలం ఉదయం, సాయంత్రం సరిపోతుంది.
కొంతకాలంగా కొన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదని ఫిర్యాదులు వచ్చాయని తెలిసింది. ఉదయం 11 గంటలకు కూడా ఆఫీసులకు వస్తున్నారని.. సాయంత్రం 5 గంటలకే వెళ్లిపోతున్నారనే విమర్శలు వచ్చాయి. అందుకే హాజరును తప్పనిసరి చేసినట్లు తెలుస్తోంది. అయితే గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించాల్సిన ఉద్యోగుల అటెండెన్స్ సంగతి ఏంటనే ప్రశ్నలు వినపడుతున్నాయి.
వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శులు, వ్యవసాయశాఖ సహాయకులు, విద్యుత్ లైన్మెన్ల విషయంలో హాజరు నిబంధన ఇబ్బందిగా ఉంటుందని.. అటువంటి వారి విషయంలో మినహాయింపు ఇవ్వాలని సచివాలయాల ఉద్యోగులు కోరుతున్నారు. ప్రభుత్వం ఈ అంశాలపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఈ నిబంధనలను అమలు చేస్తామని అధికారులు ప్రకటించారు.
ఒక్కసారి మాత్రమే హాజరు నమోదు అయితే ఆరోజు ఉద్యోగి సెలవుగా పరిగణలోనికి తీసుకుంటారు. ఈ మేరకు సచివాలయ ఉద్యోగులకు SMS రూపంలో సమాచారం తెలిపారు.