కాకినాడలోని యాంకరేజ్ పోర్టు నుంచి రేషన్ బియ్యం భారీగా తరలిపోతున్న విషయం తాజాగా తెరపైకి వచ్చింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు.
ఇంత భారీగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే ఏమి చేస్తున్నారంటూ అధికారులపై ఫైర్ అయ్యారు. ఈ విషయం వైరల్ గా మారింది.
అవును… కాకినాడ పోర్టు నుంచి రాష్ట్రంలో పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం విదేశాలకు తరలివెళ్లిపోతుందంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం కాకినాడ పోర్టుకు చేరుకున్న పవన్… అక్కడ నుంచి మంత్రి నాదేండ్ల మనోహర్ తో ప్రత్యేక బోటులో సముద్రంలోకి వెళ్లి ఓడల్ని తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా అక్కడున్న ఓడల్లోకి రేషన్ బియ్యం ఎవరు పంపారని ప్రశ్నించారు. దీంతో… అధికారులు నీళ్లు నమిలారు. వాస్తవానికి రెండు రోజుల క్రితం కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆధ్వర్యంలో సముద్రం లోపల సుమారు తొమ్మిది నాటికన్ మైళ్ల దూరంలో ఆఫ్రికా దేశాలకు వెళ్లేందుకు సిద్దమైన నౌకలో 640 టన్నుల బియ్యం పట్టుబడింది. దీన్ని నేడు పవన్ స్వయంగా వెళ్లి చూశారు.
టీడీపీ ఎమ్మెల్యే కొండబాబుపై పవన్ ఫైర్:
కాకినాడ పోర్టు నుంచి ఈ స్థాయిలో బియ్యం అక్రమంగా రవాణా జరుగుతుంటే ఏమి చేస్తున్నారంటూ అధికారులపై పవన్ మండిపడ్డారు. ఈ వ్యవహారంపై కాకినాడ సిటీ టీడీపీ ఎమ్మెల్యే కొండబాబుపై పవన్ ఫైర్ అయ్యారు. ఇంత జరుగుతుంటే ఏమి చేస్తున్నారంటూ ఎమ్మెల్యేతో పాటు అధికారులను నిలదీ శారు.
ఓడను సీజ్ చేయండి:
ఈ వ్యవహారం గురించి తెలుసుకునేందుకు తాను వస్తానంటే… లేదు సర్ 10,000 మంది జీవితాలు పోతాయని చెబుతున్నారని.. పోర్టులు ఉన్నది స్మగ్లింగ్ చేయడానికా అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే… ఆ ఓడను సీజ్ చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఏమైనా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుందన్నట్లుగా వ్యాఖ్యానించారు!
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పవన్… కాకినాడ పోర్టు నుంచి జరిగే అక్రమాలు ఆపుతామని గతంలో హామీ ఇచ్చామని.. దీనిపై స్థానిక ఎమ్మెల్యే కొండబాబు ఎప్పటి నుంచో చెబుతున్నారని అన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ పలు చోట్ల తనిఖీలు నిర్వహించి 51 వేల టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు.
ఇదే సమయంలో… కాకినాడ పోర్టుకు ప్రతి రోజూ సుమారు వెయ్యి నుంచి పదకొండు వందల లారీలు వస్తాయని.. ప్రపంచంలోని వివిధ దేశాలకు బియ్యం ఎగుమతి చేసే పోర్టుల్లో కాకినాడ చాలా ముఖ్యమైనదని.. అయితే ఇక్కడ భద్రతా సిబ్బంది మాత్రం 16 మందే ఉన్నారంటూ పవన్ తెలిపారు. మంత్రి వచ్చి తనిఖీలు చేసినా అధికారులు మాత్రం సీరియస్ గా తీసుకోవడం లేదని అన్నారు.
ఈ నేపథ్యంలో… గతంలో రాష్ట్రంలో 30వేల మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారని చెబితే అంతా వెంటకారంగా మాట్లాడారని.. అదే విషయం కేంద్రం చెప్పిన తర్వాత అందరికీ అర్ధమైందని పవన్ చెప్పడం గమనార్హం. ఈ సమయంలో తమ పాలనలో పగ, ప్రతికారాలు ఉండవు కానీ.. తప్పు చేసినవారికి మాత్రం చూస్తూ ఊరుకోమని.. రేషన్ మాఫియా వెనుక ఎవరున్నా వదిలిపెట్టమని పవన్ తెలిపారు.
కిలో రేషన్ బియ్యానికి ప్రభుత్వం సుమారు రూ.43 ఖర్చు చేస్తోందని.. ఈ బియ్యం పేద ప్రజలకు మాత్రమే చేరాలని.. కానీ, కొందరు వ్యాపారులు రేషన్ బియ్యంతో వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నరని పవన్ మండిపడ్డారు. ఈ క్రమంలో… విదేశాల్లో కిలో బియ్యాన్ని రూ.73కు అమ్ముతున్నారని తెలిసిందని తెలిపారు.
ఈ పరిణామాల నేపథ్యంలో కాకినాడ పోర్టుకు భద్రత పెంచాలని కేంద్ర హోంమంత్రికి లేఖ రాస్తానని చెప్పిన పవన్ కల్యాణ్.. రేషన్ బియ్యంతో పట్టుబడిన ఓడను సీజ్ చేయాలని.. దీనిపై సీఐడీ, సీబీఐ.. ఎవరితో విచారణ జరిపించేది త్వరలో చెబుతానని అన్నారు. ఇకపై ఇక్కడ నుంచి సరుకులు మాత్రమే రవాణా చేయాలని పవన్ కల్యాణ్ అన్నారు.