తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతోంది. ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ ముగిసింది. సర్పంచ్, వార్డు మెంబర్లుగా పోటీ చేసిన అభ్యర్థులకు గుర్తులు కూడా కేటాయించారు.
అయితే రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ విషయంలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. రిజర్వేషన్ల వ్యవహారానికి సంబంధించి దాఖలైన ఆరు పిటిషన్లపై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. చట్టప్రకారం ఎన్నికల ప్రక్రియలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది.
SC, ST జనాభా లేని ప్రాంతాల్లో కూడా ఆయా కులాలకు సర్పంచ్, వార్డు మెంబర్లుగా రిజర్వేషన్లు కేటాయించారనే దానిపై పలువురు కోర్టులో పిటిషన్ వేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ రిజర్వేషన్లు తప్పుగా కేటాయించారని పేర్కొన్నారు. అయితే రిజర్వేషన్లు కేటాయించిన చోట సంబంధిత కులానికి చెందిన వ్యక్తులు లేనట్లయితే అసలు ఎన్నికలే నిర్వహించబోమని రాష్ట్ర ఎన్నికల సంఘం కోర్టుకు వివరించింది. ఈ వాదనను రికార్డు చేసుకున్న న్యాయస్థానం విచారణను క్లోజ్ చేసింది.



































