కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను(IT) బిల్లు-2025 ను ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది.
ఆదాయపు పన్ను చట్టం,1961 స్థానంలో.. ఆ బిల్లును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇన్కమ్ ట్యాక్స్ 2025 బిల్లును కూడా కేంద్రం ఉపసంహరించుకున్నట్లు సమాచారం. అయితే దీన్ని అప్డేట్ చేసి కొత్త ఆదాయపు పన్ను బిల్లును ఆగస్టు 11న ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆదాయ పన్ను బిల్లు 2025ను ఫిబ్రవరి 13న కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది. కానీ ఈ బిల్లును విపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో బిల్లును కేంద్రం సెలెక్ట్ కమిటీకి పంపించింది. ఈ కమిటీ దానిపై అధ్యయనం చేసింది. చివరికి జులై 21న తమ రిపోర్టును పార్లమెంటుకు అందించింది. 4500 పేజీలతో ఉన్న ఈ రిపోర్టులో ముసాయిదా బిల్లుకు 285 ప్రతిపాదనలు చేసింది. వీటిని పరిగణలోకి తీసుకున్న కేంద్రం.. దీనికి అనుగుణంగా కొత్త బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఈ నూతన బిల్లును ఆగస్టు 11న లోక్సభలో ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
































