యువతరం దర్శకులు ఆడియెన్స్‌కి కొత్తగా ఏదో చెప్పాలని, ప్రేక్షకుల్ని మెప్పించాలని ప్రయత్నం చేస్తుంటారు. రొటీన్‌కి దూరంగా ఆలోచిస్తుంటారు. ఒకవేళ కథ రొటీన్‌దే ఆ బొమ్మని తెరపై ఎలా చూపిస్తే ఆడియన్స్ మెప్పు పొందుతామా అని ఆరాటపడుతుంటారు. అలాంటి తపన గల దర్శకుడే సి.సుప్రీత్ కృష్ణ. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం టుక్ టుక్.
విడుదల తేది: మార్చి 21, 2025
నటీనటులు: శాన్వీ మేఘన, హర్ష్ రోషన్ (harsh Roshan), కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, నిహాల్ కోధాటి తదితరులు.
సాంకేతికన నిపుణులు:
సినిమాటోగ్రఫీ: కార్తీక్ సాయి కుమార్
సంగీతం: సంతు ఓంకార్
ఎడిటర్: అశ్వత్ శివకుమార్
నిర్మాత: రాహుల్ రెడ్డి
దర్శకత్వం: సి.సుప్రీత్ కృష్ణ
యువతరం దర్శకులు ఆడియెన్స్‌కి కొత్తగా ఏదో చెప్పాలని, ప్రేక్షకుల్ని మెప్పించాలని ప్రయత్నం చేస్తుంటారు. రొటీన్‌కి దూరంగా ఆలోచిస్తుంటారు. ఒకవేళ కథ రొటీన్‌దే ఆ బొమ్మని తెరపై ఎలా చూపిస్తే ఆడియన్స్ మెప్పు పొందుతామా అని ఆరాటపడుతుంటారు. అలాంటి తపన గల దర్శకుడే సి.సుప్రీత్ కృష్ణ. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం టుక్ టుక్. టైటిల్‌తోనే ప్రేక్షకుల్ని ఆలోచనలో పడేశాడు. ఇటీవల కోర్ట్ సినిమాతో హిట్ అందుకున్న హర్ష్ రోషన్, ఇప్పటికే పలు చిత్రాలతో ఆకట్టుకున్న తెలుగింటి అమ్మాయి శాన్వి మేఘన, సలార్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ దేవ్ ఇలా కొందరు నూతన ఆర్టిస్ట్‌లతో తీసిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రచార చిత్రాలతో ఆకట్టుకున్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు అలరించిందో చూద్దాం.
కథ: (Tuk Tuk Movie Review)
యుక్త వయసులో ఉన్న ముగ్గురు కుర్రాళ్ళు(హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు) డబ్బుల కోసం వినాయకుడి విగ్రహం పెట్టి వినాయక చవితి పండుగ చేస్తారు. ఆ ఊళ్లో ఇరు వ్యక్తుల మధ్య చిన్నపాటి గొడవలు ఉండటం వల్ల ఆ ముగ్గురు పెట్టిన వినాయకుడి నిమజ్జనానికి వాహనం దొరకదు. దాంతో ఈ ముగ్గురు కలిసి పాడు పట్ట చేతక్ స్కూటర్‌ను ఓ షెడ్ నుంచి బయటకు తీసి మరమత్తులు చేయించి లైన్‌లోకి తీసుకొస్తారు. దానికి టుక్ టుక్ అని పేరు పెట్టి వినాయకుడిని దానిపైనే ఊరేగించి నిమజ్జనం చేస్తారు. ఆ తర్వాత ఆ స్కూటర్ కొన్ని విన్యాసాలు చేస్తుంది. ఏ ప్రశ్న అడిగినా సమాధానంగా హ్యాండిల్ అటు.. ఇటు తిప్పడం, లైట్ వెలగడం చేసి సమాధానం ఇస్తుంది. దాంతో ఆ స్కూటర్‌లో ఏదో ఉందని అక్కడి వాళ్లు నమ్ముతారు. ఇంతకీ ఆ స్కూటర్‌లో ఉన్నది ఏంటి? శిల్ప (శాన్వీ మేఘన)కు ఆ స్కూటర్‌కి సంబంధం ఏంటి? స్వేచ్ఛగా విహరించాలనుకునే శాన్వీ ఎవరు, ఆమెకి ఏమైంది అన్నది కథ.
చిత్తూరు జిల్లాలోని ఓ గ్రామంలో ముగ్గురు కుర్రాళ్లు, ఓ క్యూట్ లవ్ పెయిర్, పచ్చని పల్లె వాతావరణం.. ఓ టుక్ టుక్ బండి.. అది చేసే వింతలు, ఆ టుక్ టుక్ బండిలో ఏముంది.. సింపుల్‌గా ఇదీ కథ. దీంతోపాటు గ్రామాల్లో మహిళలను చూసే ధోరణి, చదువుకున్నా స్వేచ్ఛ లేకుండా ఇంటికే పరిమితం చేయడం అనేది కూడా ఇందులో ఓ పాయింట్‌గా చెప్పారు. చదువుకుని, హద్దులు మీరకుండా తనకు నచ్చినట్లు జీవితం ఉండాలని కోరుకునే అమ్మాయికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అనే కథకు ఓ టుక్ టుక్ బండిని జోడించి ఎమోషనల్ జర్నీగా దర్శకుడు ఈ కథను డ్రైవ్ చేశాడు. ఓ వాహనం విన్యాసాలు చేయడం అనేది గతంలోనూ బామ్మ మాట బంగారు బాట, కారా మజాకా వంటి చిత్రాల్లో చూశాం. అయితే ఇందులో టుక్‌టుక్ స్కూటర్ పెద్దగా విన్యాసాలు ఏమీ చేయదు కానీ తను చెప్పాలనుకున్న తను ఎంచుకున్న ముగ్గురు కుర్రాళ్లకు సైగల రూపంలో అర్థమయ్యేలా చెబుతుంది. దాని ద్వారా అసలు ఆ టుక్ టుక్ అలా చేయడానికి కారణమేంటి? అందులో దేవుడు ఉన్నాడా? ఏదైనా ఆత్మ ఉందా? అని కనిపెట్టే సీక్వెన్స్ ఆసక్తికరంగా ఉంది. దానికి ఫన్‌తోపాటు భావోద్వేగాలనూ జోడించాడు. బండిలో ఉన్నది ఆత్మ అని తెలిసిన తర్వాత ఆ ముగ్గురు కుర్రాళ్లు భయపడటం, వాళ్లను పరిగెత్తించడం నవ్వులు పూయిస్తుంది. ఇందులో టుక్‌టుక్ స్కూటర్ ఎక్కడా మాట్లాడదు. కానీ అడిగిన దానికి అవును, కాదు అని ఇండికేషన్స్ మాత్రమే ఇస్తుంది. అది ఒకింత కొత్తగా ఉంది. అయితే అందులో ఉన్న ఆత్మ కథ ఏంటి అన్నది చెప్పడానికి దర్శకుడు ఫస్టాఫ్ మొత్తం తీసుకున్నాడు. ప్రథమార్థం అంతా టుక్ టుక్ బండి, ముగ్గురు కుర్రళ్లు నడుమే సాగుతుంది. అలాగే బండి ఉన్న ఆత్మ గురించి చెప్పే సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. సెకెండాఫ్ బలంగా, భావోద్వేగంగా మార్చడానికి దర్శకుడు ఫస్టాఫ్ అంతా అలా సాగదీసిన భావన కలుగుతుంది. అంతా బాగానే నడిపించిన అసలు ఆ ఆత్మ ఆ బండిలోకి ఎలా వచ్చిందనేది గాలికి వదిలేశాడు. సపైన క్లారిటీ ఇవ్వలేదు. ఇందులో హీరోయిన్‌కి చేతక్ బండి డ్రైవింగ్ ఇష్టం కాబట్టి అందులోకి ఆత్మ వెళ్లిందనుకోవాలేమో! నిహాల్ కోధాటి, శాన్వీ మేఘనల మధ్య లవ్ స్టోరీ క్యూట్‌గా కొత్తగా ఉంది. చెబితే కథలో సస్పెన్స్ రివీల్ అవుతుంది కానీ.. ప్రేమ, భావోద్వేగం, తల్లిదండ్రుల మనో వ్యధ ఉన్న ఈ కథను గోడ మీద చిన్న లైన్‌తో చెప్పి సినిమాను క్లోజ్ చేశాడనిపిస్తుంది. హీరోయిన్ పాత్రను బాగా రాసుకున్నాడు. ప్రేమికుడి చేతక్ బండితో సెకెండ్ పార్ట్‌కి లీడ్ ఇచ్చారు. అయితే ఈ చిత్రం చిత్తూరు జిల్లా నేపథ్యం, అక్కడి యాసతో నడిచినా తెరపై కనిపించేది అంతా కోనసీమ ప్రాంతమే. అలా ఎందుకు చేశారో తెలియదు.
నటీనటుల విషయానికొస్తే.. తెలుగింటి అమ్మాయి శాన్వీ అందం, అభినయంతో ఆకట్టుకుంది. స్వేచ్ఛ, ధైర్యవంతురాలైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో చక్కగా ఇమిడిపోయింది. టీనేజీ కుర్రాళ్ళ పాత్రల్లో హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు ఎనర్జీతో నటించారు. చక్కగా నవ్వించారు. నిహాల్ కోదాటి కూడా ఫర్వాలేదు. మిగతా ఆర్టిస్ట్‌లు కూడా ఓకే అనిపించారు. టెక్నికల్‌గా సినిమా ఉన్నతంగా ఉంది. పచ్చని పొలాలు, పెంకుటిళ్లు, కొబ్బరి తోటలు తెరపై ఆహ్లాదకరంగా అనిపిస్తాయి. ఆ వాతావరణానికి తగ్గట్టే సంతు ఓంకార్ అంతే ఆహ్లాదకరమైన సంగీతం అందించారు. ఈ సినిమాకు కెమెరా వర్క్, సంగీతం హైలైట్‌గా నిలుస్తుంది. నేపథ్య సంగీతం ఫ్రెష్ ఫీల్ కలిగిస్తుంది. ఎడిటర్, ఫస్టాఫ్ కాస్త షార్ప్ చేయాల్సింది. మాటలు, పాటలు ఆకట్టుకున్నాయి. దర్శకుడు ఎంచుకున్న కథ బావుంది. తెరకెక్కించడంలో చిన్నచిన్న పొరపాట్లు ఉన్నా.. తను చెప్పాలనుకున్న పాయింట్‌ను బాగానే కన్వే చేశాడు. గ్రామాల్లో అమ్మాయిలు ఇలాగే ఉండాలి అన్న రూల్ బ్రేక్ చేసేలా చిన్నపాటి సందేశం ఇచ్చాడు. ప్రేమ, విలేజ్ బ్యాక్‌డ్రాప్, ఎమోషనల్ డ్రామా కథలను ఇష్టపడే వారికి టుక్‌టుక్ నచ్చుతుంది.