వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల నిప్పులు చెరిగారు. బడ్జెట్ సమావేశానికి కూడా జగన్ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపే బాధ్యత జగన్‌కు లేదా అని నిలదీశారు. అసెంబ్లీకి వెళ్లకుంటే రాజీనామా చేయాలని షర్మిల కోరారు.
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డిపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సెటైర్లు గుప్పించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా జగన్ అదే పాట పాడుతున్నారని విమర్శించారు. జగన్‌ను ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారని విషయం గుర్తుకు రావడం లేదా అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు అసెంబ్లీకి వెళ్లాలి కదా అని ప్రశ్నించారు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, మైకు ఇవ్వరని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. జగన్ పార్టీకి గతంలో 151 సీట్లు ఇస్తే ప్రజలను అన్ని విధాలా మోసం చేశారని వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు.
జగన్ మాట తప్పాడు..
‘‘మద్యపాన నిషేధం, పోలవరం, అమరావతి, ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో జగన్ మాట తప్పాడు. అందుకే ప్రజలు 11 సీట్లే జగన్‌కు ఇచ్చారు. మీరు అసెంబ్లీకి వెళ్లి ఎమ్మెల్యేగా మాట్లాడాలి కదా. మేము అధికారంలోకి రాకుంటే అసెంబ్లీకి వెళ్లమని అప్పుడు చెప్పలేదే. మీకు ప్రజలు ఓట్లు వేసింది అసెంబ్లీకి వెళ్లమనే కదా. ప్రజల తరపున గెలిచిన వారు అసెంబ్లీకి వెళ్లాలి. ఇది సరైన విధానమా… మీరు సభను అవమానిస్తున్నారా. నిన్న బడ్జెట్ సమావేశానికి కూడా వెళ్లలేదు. ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపే బాధ్యత జగన్‌కు లేదా. అసెంబ్లీకి వెళ్లకుంటే మీరు రాజీనామా చేయాలి. మళ్లీ అసెంబ్లీకి వెళ్లమని చెప్పి ఎన్నికలకు వెళ్లండి. అప్పుడు ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారు. వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీకి వెళ్లాలని కాంగ్రెస్ పక్షాన లేఖ రాశాను’’ అని వైఎస్ షర్మిల గుర్తుచేశారు.
సోషల్ మీడియా పోస్ట్‌లపై షర్మిల ఫైర్..
‘‘సోషల్ మీడియా పోస్ట్‌లపై షర్మిల స్పందించారు. నేను కూడా సోషల్ మీడియా బాధితురాలినే. నామీద, అమ్మ విజయమ్మ, సునీతల మీద నీచంగా పోస్ట్‌లు పెట్టించింది జగనే. ఆయన ప్రోద్బలంతో నాపై నీచంగా పోస్ట్‌లు పెట్టారు. సోషల్ మీడియాలో ఇలాంటి పోస్ట్‌లు ఆగాలి. కొన్ని సంవత్సరాలుగా సైతాన్ సైన్యాన్ని వైసీపీ ఏర్పాటు చేసుకుంది. ఇది సహించరాని విషయం.. నా క్యారెక్టర్‌పై విమర్శలు చేస్తారా. ధైర్యం ఉంటే నేరుగా వచ్చి మాట్లాడాలి.. నీచమైన పోస్ట్‌లు ఏంటి. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. సోషల్ మీడియా పరిధిలో పోస్ట్‌లు ఉండాలి. పరిధి దాటితే తప్పకుండా చర్యలు ఉండాలి. పోస్ట్‌లు పెట్టిన వారితోపాటు వెనుక ఉన్నవారిని పట్టుకోవాలి. జగన్, అవినాష్ ఎవరు ఉన్నా విచారించి శిక్షించాలి. పోలీసులు విచారణ చేసి అందరినీ అరెస్టు చేయాలి. పోలీసు వ్యవస్థను సొంతానికి వాడుకుంది జగనే. ఇప్పుడు పోలీసులను హెచ్చరించడం హాస్యాస్పదంగా ఉంది. మళ్లీ అధికారంలోకి వస్తామని జగన్ కలలు గంటున్నాడు. పోలీసులను బెదిరిస్తున్నారంటే వీరికి అహంకారం తగ్గలేదు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేసి అరెస్టు చేయాలి’’ అని షర్మిల పేర్కొన్నారు.
ఇది ప్రజా వంచన బడ్జెట్…
‘‘ఏపీ ప్రభుత్వం నిన్న బడ్జెట్ ప్రవేశ పెట్టింది. చంద్రబాబు అపార అనుభవం, మేధస్సు గురించి గొప్పగా చెప్పారు. కానీ ఇది బడ్జెట్టా, మ్యానిఫెస్టోనా అనేది ప్రజలకు అర్ధం కాలేదు. ఈ బడ్జెట్‌లో కేటాయింపులు లేవు, స్పష్టత లేదు. చంద్రబాబు గొప్పగా సూపర్ సిక్స్‌ను చెప్పుకున్నారు. వీటి అమలుకు లక్షా ఇరవై వేలకోట్ల రూపాయలు అవసరమని అంచనా వేశారు. కోటి మంది మహిళలకు మహిళా శక్తి కింద నెలకు రూ. 1500 అన్నారు. తల్లికి వందనం పేరుతో 80 లక్షల మంది బిడ్డలకు రూ.12 వేల కోట్లు ఖర్చు అయ్యే పథకం. దీనికి రూ.2400 కోట్ల రూపాయలే కేటాయించారు. మహిళలకు ఉచిత బస్సుకు బడ్జెట్‌లో కేటాయింపులు చేయలేదు. 30 లక్షల మందికి నెలకు రూ 400 కోట్లు ఖర్చు అయ్యే పథకం ఇది. 52లక్షల మంది రైతులకు రాష్ట్రం తరపున రూ, 8 వేల కోట్లకు గానూ రూ. 4 వేలకోట్లే కేటాయించారు. నిరుద్యోగ భృతి కింద రూ.3000 నెలకు ఇస్తాం అన్నారు .. కేటాయించలేదు. ఏడాదికి 8 లక్షల ఇళ్లు అన్నారు.. కేవలం 4000 కోట్లే కేటాయించారు. ఉచిత గ్యాస్ సిలిండర్‌లకు రూ. 4వేల కోట్లు ఖర్చు అవుతుంటే రూ.900 కోట్లే కేటాయించారు. సున్నా వడ్డీకే రుణాలు అన్నారు.. అదీ అమలు చేయడం లేదు. ఎన్నికల్లో గెలవడానికి మాత్రమే చంద్రబాబు వాగ్దానం చేశారా. వాటిని అమలు చేసి, ప్రజల కష్టం తీర్చే బాధ్యత లేదా. విద్యుత్ బిల్లులకు కూడా 40 శాతం పెంచి వసూల్ చేస్తున్నారు. ప్రధాని మోదీకి కొమ్ము కాస్తున్న చంద్రబాబు విద్యుత్ భారం రద్దు చేయించ లేకపోయారు. ఇది ప్రజల బడ్జెట్ కాదు… ఓట్ల కోసమే వాగ్దానాలు. ఇక వైసీపీ ప్రభుత్వానికి, మీకూ తేడా ఏమిటి. జగన్ అన్ని అప్పులు చేశారని, కట్టాలని చంద్రబాబుకు తెలియదా. ఇది ప్రజా వంచన బడ్జెట్‌గా పరిగణిస్తున్నాం’’ అని షర్మిల విమర్శలు చేశారు.