ఆమె క్రికెటర్స్‌ పాలిట దేవత..1983 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టు కోసం..

www.mannamweb.com


బాలీవుడ్‌ దిగ్గజ లెజండరీ గాయని లతా మంగేష్కర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె తన మధురమైన గానంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఆమె కేవలం గొప్ప గాయని మాత్రమే కాదు గొప్ప క్రికెట్‌ అభిమాని కూడా. భారతదేశం ప్రపంచ క్రికెట్‌లో సూపర్‌ పవర్‌గా లేని రోజల్లో అనూహ్యంగా టీమ్‌ ఇండియా ప్రపంచకప్‌ గెలుచుకుని అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు లోను చేసింది. ఆ ఘట్టం చరిత్రలో మర్చిపోని గొప్ప రోజు. అయితే ఆ రోజుల్లో బీసీసీఐ వద్ద సరిపడ నిధులు కూడా లేవు. ఇంతటి ఘన విజయం అందించిన ఆటగాళ్లుకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉంది. ఆ టైంలో మన క్రికెటర్లను సత్కరించేందుకు తన వంతుగా మద్దతు ఇస్తూ ఏం చేశారో తెలుసా..!

జూన్ 25, 1983.. భారత క్రికెట్ చరిత్రలో ఆ రోజును ఎవరు మర్చిపోలేరు. ఇంగ్లండ్ గడ్డపై భారత్ నిలిచి అందరికి షాక్ ఇచ్చింది. ఆ రోజు చిరస్మరణీయమైనది, ప్రత్యేకమైనది. భారత్‌లో క్రికెట్ ఉన్నంత కాలం ఆ రోజుని ఎప్పటికీ మరిచిపోలేం. కపిల్ దేవ్(Kapil Dev) సారథ్యంలో టీమిండియా తొలి ప్రపంచకప్ గెలిచి ఇప్పటికీ 40 ఏళ్లు. జూన్ 25, 1983న లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో వరుసగా రెండుసార్లు ప్రపంచకప్(World Cup) సాధించి మంచి ఊపుమీద ఉన్న వెస్టిండీస్‌తో జరిగిన ఫైనల్లో భారత్ 43 పరుగుల తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది.

అప్పటి నుంచే భారత క్రికెట్‌లో కొత్త శకం మొదలైంది. ఈ వన్డే ప్రపంచకప్ గెలవడానికి ముందు, టీమ్ ఇండియా 1975 మరియు 1979 ప్రపంచకప్‌లలో లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఈ టోర్నీల్లో భారత్ కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ఆ రెండు టోర్నీల్లో వెస్టిండీస్(West Indies) ఛాంపియన్‌గా నిలిచింది. అయితే హ్యాట్రిక్ విజయంపై ఆశలు పెట్టుకున్న వెస్టిండీస్‌కు భారత్ గట్టి షాకిచ్చింది. నిజానికి భారత్‌ లీగ్‌లోనే స్వదేశానికి చేరుకుంటారనేది అందరి ఊహగానాలు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ..ఈ టోర్నీలో భారత్ చాంపియన్‌గా నిలిచి తొలి ట్రోఫీని తన ఖాతాలో వేసుకుని చరిత్ర సృష్టించింది.

ఆ ఏడాది ప్రపంచకప్‌ టోర్నీకి ఇంగ్లాండ్‌ ఆతిథ్యమిచ్చింది. చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్(World Cup Final) జరిగింది. తొలుత భారత జట్టు బ్యాటింగ్ చేసింది. కానీ ఆశించినంత స్థాయిలో స్కోర్‌ చేయలేదు. కేవలం 54.4 ఓవర్లలో 183 పరుగులు మాత్రమే చేసింది. వెస్టిండీస్‌కు ఈ లక్ష్యం పెద్దది కాదు. మంచి మంచి బ్యాటర్లు జట్టులో ఉన్నారు. అయితే బౌలర్లు మదన్ లాల్, మొహిందర్ అమర్‌నాథ్ ధాటికి విండీస్ 140 పరుగులకే ఆలౌటైంది. భారత్ 43 పరుగుల తేడాతో విజయం సాధించి తొలి ప్రపంచకప్‌ను ఎగరేసుకుపోయి సంబరాలు చేసుకుంది. ఈ ఘన విజయంతో భారత్‌లో యువత ఆసక్తి క్రికెట్‌ వైపు మళ్లింది. అభిమానుల సంఖ్య పెరిగింది.

గల్లీ గల్లీలో క్రికెట్ ఆడేంతగా ఆ ఆటపైక్రేజ్‌ పెరిగిపోయింది. అయితే అప్పట్లో బీసీసీ వద్ద నిధులు లేవు. కనీసం భారత్‌కి ఇంత ఘన కీర్తిని తెచ్చిపెట్టిన ఆటగాళ్లను సత్కరించేందుకు కూడా బీసీసీఐ వద్ద డబ్బులు లేవు. ఆ సమయంలో బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్‌కేపీ సాల్వే, క్రికెట్ అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న రాజ్‌సింగ్ దుంగార్‌పూర్‌లు లతా మంగేష్కర్‌ను సంప్రదించి ఈ విషయాన్ని చెప్పారు. అందుకు మద్దుతు ఇవ్వడంతో దేశ రాజధానిలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో లతా మంగేష్కర్‌ కచేరిని ఏర్పాటు చేసి ఫండింగ్‌ని కలెక్ట్‌ చేశారు. ఈ కచేరీ ద్వారా అప్పట్లో దాదాపు రూ. 20 లక్షలు దాక నిధులను బీసీసీఐ సేకరించింది.

జీవితకాల పాస్‌..
ఆ మొత్తం నుంచి 14 మంది ఆటగాళ్లకు వారి అత్యుత్తమ ప్రదర్శనకు గానూ ప్రోత్సాహకంగా రూ. 1 లక్ష చొప్పున అందించారు. ఇక సంగీత కచేరి కోసం లతా మంగేష్కర్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఆ సమయంలో తమకు సహాయం చేసిన లతా మంగేష్కర్‌కు బీసీసీఐ పెద్ద గిఫ్ట్‌ ఇచ్చింది. ప్రపంచంలో ఎక్కడైనా భారత క్రికెట్ జట్టు మ్యాచ్ జరుగుతున్నా.. లతా మంగేష్కర్ చూసేందుకు ఉచిత పాస్ అందించారు. అంటే జీవితకాల పాస్ అన్నమాట.

ఆమె జీవితకాలం ప్రపంచంలో ఎక్కడ మ్యాచ్ జరిగినా ఆమె ఉచితంగా చూడొచ్చు. కానీ ఆమె ఎప్పుడూ ఆ పాస్ ఉపయోగించలేదు. కానీ బీసీసీఐ మాత్రం ఆమె సహకారాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు. లతా మంగేష్కర్ గౌరవ సూచకంగా భారతదేశంలో ఆడే ప్రతి అంతర్జాతీయ మ్యాచ్‌కు బోర్డ్ ఎప్పుడూ రెండూ టికెట్లను లతా మంగేష్కర్ కోసం రిజర్వు చేసింది. ముఖ్యంగా ప్రపంచ కప్ గెలిచిన కపిల్ దేవ్ బృందం కోసం లతా మంగేష్కర్ సోదరుడు పండిట్ హృద్యనాథ్ ప్రత్యకంగా ఓ పాటే రాయడం విశేషం.ఇలాంటి వాళ్లు తమ కళతోనే గొప్పగొప్ప సేవకార్యక్రమాలు చేసి చరిత్రలో నిలిచిపోవడమే గాక భావితరాలకు గొప్ప స్ఫూర్తిగా ఉంటారు.