ఆధునిక రోజుల్లో నిమిషాల్లోనే మోసాలు జరిగిపోతున్నాయి. పెరిగిన టెక్నాలజీని బాగా వాడేస్తూ రోజుకో కొత్త సైబర్ మోసానికి తెర లేపుతున్నారు ఆన్ లైన్ కేటుగాళ్లు.
బ్యాంకుల పేర్లతో మోసాలు, డిజిటల్ అరెస్టుల పేరుతో అమాయకుల దగ్గర లక్షల రూపాయలు కాజేయడం వంటి ఘటనలు ప్రతి రోజూ చూస్తూనే ఉన్నాం. ఇంతలో తెలంగాణలో మరో సరికొత్త మోసం వెలుగు చూసింది.
ప్రభుత్వ మీసేవ పేరుతో ఓ నకిలీ వెబ్ సైట్ ప్రారంభించి కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ అధికారిక మీసేవ వెబ్ సైట్ meeseva.telanana.gov.in కాగా meesevatelangana.in పేరుతో నకిలీది సృష్టించారు. ఇందులో కొత్తగా మీ సేవ కేంద్రాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామంటూ HYD కలెక్టర్ పేరుతో ఫీజు వివరాలు ప్రకటించారు. దీంతో ఇది చూసి చాలా మంది ఆన్ లైన్ చెల్లింపులు చేశారు.
ఈ విషయం వెలుగులోకి రావడంతో ఈ స్కామ్ పై సైబర్ సెల్ దర్యాప్తు చేస్తోంది. సదరు నకిలీ వెబ్ సైట్ బ్లాక్ చేసింది. అయితే ఇలాంటి ఆన్ లైన్ కేటుగాళ్లు పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, తెలియని వ్యక్తులకు చెప్పింపులు చేసే విషయంలో పలు జాగ్రత్తలు అవసరం అని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.
మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాధనాలను ఆధారంగా చేసుకుని డీప్ ఫేక్ వీడియోలు, వాయిస్ క్లోనింగ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించి ప్రజలను మోసం చేయడం మరింత ఆందోళనకరంగా మారింది. సచిన్ తెందూల్కర్, విరాట్ కోహ్లీ, అమితాబ్ బచ్చన్, రష్మిక వంటి ప్రముఖుల పేర్లను కూడా వాడుతూ డీప్ ఫేక్‌ల ద్వారా ప్రజలను నమ్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.