మూగ జంతువుల పట్ల కనికరం చూపించేవారు కొందరు ఉంటే, వాటిని ఆట బొమ్మలుగా చూస్తూ హింసించేవారు మరికొందరు ఉంటారు. మూగజీవులను ఇబ్బంది పెట్టే వారికి సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో కనిపిస్తాయి.
వీటిని చూసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. తాజాగా ఈ తరహా వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ బాలుడు స్విమ్మింగ్ పూల్‌లో మొసళ్ల పిల్లల (Baby crocodiles)తో కలిసి ఈత కొడుతూ కనిపించాడు. ఈ 17 సెకన్ల క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆగ్రహాన్ని రేకెత్తించింది.
‘కొన్నిసార్లు మన సమస్యలకు మనమే కారణమవుతాం’ అనే క్యాప్షన్‌తో కూడిన వీడియోను ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేయగా దీనికి 1.5 లక్షల వ్యూస్ వచ్చాయి. వందలాది కామెంట్లు వచ్చాయి. ఈ బాలుడు వందల సంఖ్యలో మొసలి పిల్లలు ఉన్న స్విమ్మింగ్ పూల్‌లోకి భయం లేకుండా ఒకేసారి దూకేశాడు. అతడు జంప్ చేయగానే చుట్టూ ఉన్న అనేక చిన్న మొసళ్లు హడలిపోయాయి. కొన్ని ఈత కొడుతూ వేరే వైపుకు పారిపోయాయి. బాలుడు మాత్రం నీళ్లు చిమ్ముతూ, మొసళ్లను పట్టుకుంటూ ఎంజాయ్ చేశాడు. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగింది, ఎవరు చిత్రీకరించారు అనే విషయాలు తెలియరాలేదు.
Sometimes we are the cause of our own problems 🤯#viral pic.twitter.com/DBg9zEXfe3
— Fallou Curry . (@FallouL1021) February 5, 2024
* నెటిజన్ల రియాక్షన్స్
వీడియోను చూసిన చాలా మంది బాలుడి చర్యలకు స్టన్ అయిపోయారు. ఈ పిల్లోడు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడని, బాధ్యతారాహిత్యంగా ఉన్నాడని కొందరు విమర్శించారు. మొసళ్లు చిన్న వయస్సులో ఉన్నప్పుడు కూడా ప్రమాదకరమైనవి అని, ఒకేసారి మూకుమ్మడిగా దాడి చేస్తే బాలుడు తీవ్ర గాయాల పాలయ్యే ప్రమాదం ఉందని మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లవాడి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఇందులోకి దించిన తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేయాలని మరికొందరు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇదే పని, ఇదే మొసళ్లతో మూడేళ్ల తర్వాత చేసి చూడు అంటూ మరికొందరు ఛాలెంజ్ విసిరారు. ‘అలా చేస్తే మొసళ్లు ఒక్క నిమిషం వ్యవధిలోనే ఒక్క ఎముక మిగలకుండా తినేస్తాయి. తల్లిదండ్రులు ఇలాంటి పిచ్చి పనులు చేసిన పర్లేదు కానీ పిల్లలను ఇలాంటి పనులు చేసేలా ప్రోత్సహించవద్దు.’ అని ఒక యూజర్ హితవు పలికాడు. ఇది సరదా పని కాదని, ఇది మూగజీవులను హింసించడం అని మరి కొంతమంది అన్నారు. పిల్లవాడు ఇలా చేయడానికి అసలు ఎవరు అనుమతి ఇచ్చారు అని మరి కొందరు నిలదీశారు.
* చట్ట విరుద్ధం
మొసళ్లను పెంపుడు జంతువులుగా ఉంచుకోవడంలోని చట్టబద్ధత, నైతికత, అలా చేయడం వల్ల కలిగే నష్టాల గురించి కూడా వీడియో ప్రశ్నలను లేవనెత్తింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మొసళ్లు పెంపకానికి తగినవి కావు, ఎందుకంటే అవి వేగంగా పెరుగుతాయి. ప్రత్యేక శ్రద్ధ, సౌకర్యాలు అవసరం. అవి వేటాడి చంపే బలమైన ప్రవృత్తిని కలిగి ఉంటాయి. దీనివల్ల యజమానులు జాగ్రత్తగా ఉండకపోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. భారతదేశం వంటి కొన్ని దేశాల్లో, మొసళ్లను సాదు జంతువుగా పెంచుకోవడం చట్టవిరుద్ధం, చట్టం ప్రకారం శిక్షార్హమైనది.