అమరావతి: పాఠశాలల్లో ఎక్కడా ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలని, అవసరమైతే విద్యా వాలంటీర్లను నియమించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఉపాధ్యాయుల కొరత వల్ల విద్యా నాణ్యత దెబ్బతినకూడదు. ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయో అన్నింటికీ వాలంటీర్లను తీసుకోండి. పాఠశాలల్లో విజ్ఞాన, విహార యాత్రలు, క్రీడలు నిర్వహించాలి. పిల్లలు ఒత్తిడి లేకుండా ఆనందంగా చదువుకునే పరిస్థితి రావాలి’ అని సూచించారు.‘మొదట అందరూ పాఠశాలకు రావడం నేర్చుకుంటే ఆ తర్వాత ప్రభుత్వ బడులకు తీసుకురావడం ఎలా అనేది ఆలోచించొచ్చు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి ఎక్కడో చోట బడిలో ఉండాలి. గుత్తేదారు ఏకరూప దుస్తులను సరఫరా చేయలేకపోతే ఆ పరిమాణాన్ని మిగతా గుత్తేదార్లకు సమానంగా పంచాలి. ఆలస్యం కాకుండా చూడాలి. విద్యార్థులకు శాశ్వత అకడమిక్ నంబరు(ఏపీఏఏఆర్) ఇచ్చేలా చూడాలి’ అని తెలిపారు.
‘‘రాష్ట్రంలో 20లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. ప్రస్తుతం వర్చువల్ ఉద్యోగాలకు డిమాండ్ ఉంది. ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో వర్క్‌స్టేషన్లు ఏర్పాటు చేయాలి. కనీసం, సరాసరి జీతం నిర్ణయించి, అంత ఇస్తే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. నైపుణ్యాలు అందించి మరో స్థాయికి ఉద్యోగులను తీసుకెళ్తే అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఈ తరహా ఇన్నోవేటివ్ పథకాన్ని తీసుకురావాలి. తద్వారా 5-10లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. దేశంలో ఎవ్వరూ దీన్ని రూపొందించలేదు. దేశంలో ముఖ్యమైన 100మందిని పిలిచి ముందు వర్క్‌షాపు పెడదాం. అందరూ అమోదం తెలిపిన తర్వాత పాలసీ తయారు చేద్దాం. ఏపీని వర్చువల్ వర్కింగ్ హబ్‌గా మారుద్దాం’ అని సూచించారు.
సీబీఎస్‌ఈ పరీక్షలకు సన్నద్ధం చేయాలి
-మంత్రి లోకేశ్
తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాన్ని ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించాలని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ‘‘రెసిడెన్షియల్, ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీ విద్యార్థులను సీబీఎస్‌ఈ పదోతరగతి పరీక్షలకు సన్నద్ధం చేయాలి. మొదటిసారి సీబీఎస్‌ఈ పరీక్షలకు వెళ్తున్నారు. పొరపాటున పిల్లవాడు ఫెయిల్ అయితే జీవితాంతం బాధపడతారు. వారిని పరీక్షలకు జాగ్రత్తగా సన్నద్ధం చేయాలి’ అని మంత్రి తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో స్థిరంగా ఒక ప్రదేశంలో ఉద్యోగ మేళాలు ఏర్పాటుచేస్తామని, విద్యార్థుల వివరాలను ఆధార్‌తో లింకు చేసి, ప్రత్యేక నంబరు ఇస్తామని ఉన్నత విద్య కార్యదర్శి సౌరబ్‌గౌర్ పేర్కొన్నారు.