కొత్తగా బంగారం కొనాలని ప్లాన్ చేసుకునే వారు ఒకేసారి పెద్ద మొత్తంలో కొనుగోలు చేయవద్దు. బదులుగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) తరహాలో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం బెటర్. ఇలా చేయడం ద్వారా ధర గరిష్టంగా ఉన్నప్పుడు కొనుగోలు చేసి..
ఈ ఏడాది ముగింపు దశకు చేరుకుంటోంది. కొత్త ఏడాదికి నెల రోజులు కూడా లేదు. 2025 సంవత్సరానికి వీడ్కోలు పలికి 2026కి స్వాగతం పలుకనున్నాము. ఈ నేపథ్యంలో చాలా మంది పెట్టుబడిదారులు 2026 కోసం తమ ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ప్రణాళికల్లో బంగారం, వెండి కీలక పాత్ర పోషిస్తాయి. ఈ ఏడాది బంగారం ధరలు స్థిరంగా ఉండటమే కాకుండా, గణనీయంగా పెరిగాయి. అయితే ప్రపంచ ఎకానమీ మిశ్రమంగా ఉన్నందున చాలామంది పెట్టుబడిదారులు గందరగోళంలో ఉన్నారు. ఈ సమయంలో బంగారం కొనాలా? లేక అమ్మేయాలా? దీనిపై నిపుణులు ఏమంటున్నారు తెలుసుకుందాం.ఇప్పటికే బంగారం ఉన్నవారు ఏం చేయాలి? : మీ వద్ద ఇప్పటికే మీ పోర్ట్‌ఫోలియోలో బంగారం ఉన్నట్లయితే అలానే ఉంచుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. బంగారం వేగవంతమైన రాబడిని ఇవ్వకపోవచ్చు. కానీ ద్రవ్యోల్బణం, కరెన్సీ హెచ్చుతగ్గులు లేదా ప్రపంచ ఉద్రిక్తతల వంటి అనిశ్చిత సమయాల్లో ఇది మీ సంపదను రక్షించే ‘భద్రతా వలయం’గా పని చేస్తుంది. అలాగే పిల్లల వివాహాలు, ఇతర దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం బంగారాన్ని మంచి పెట్టుబడిగా గుర్తించాలి.
కొత్త ఇన్వెస్టర్లు ఏం చేయాలి? : కొత్తగా బంగారం కొనాలని ప్లాన్ చేసుకునే వారు ఒకేసారి పెద్ద మొత్తంలో కొనుగోలు చేయవద్దు. బదులుగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) తరహాలో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం బెటర్. ఇలా చేయడం ద్వారా ధర గరిష్టంగా ఉన్నప్పుడు కొనుగోలు చేసి, ఆ తర్వాత చింతించే పరిస్థితిని ఇది నివారిస్తుంది. మార్కెట్ హెచ్చుతగ్గులను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. 5 నుంచి 7 సంవత్సరాల పాటు చిన్న సిప్స్‌లో కొనసాగితే మంచి రాబడిని పొందడానికి అవకాశం ఉంది.
వెండిలో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం మంచిదేనా? వెండి.. బంగారం కంటే తక్కువ ధరకే లభిస్తుంది. పారిశ్రామిక రంగంలో (సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్స్) దాని డిమాండ్ పెరుగుతున్నందున భారీ వృద్ధిని చూపిస్తోంది. అయితే వెండి విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ప్రస్తుతం వెండికి కూడా భారీగా డిమాండ్ ఉంది.
పరిశ్రమ డిమాండ్, ప్రపంచ సరఫరా, రాజకీయ సంఘటనలలో మార్పుల కారణంగా వెండి ధరలు భారీగా పెరగడం, తగ్గడం జరుగుతుంటుంది. ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియని పరిస్థితి ఉంటుంది. అలాగే వెండి ధర అప్పుడప్పుడు తీవ్రంగా పడిపోయే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు లాభాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. దీర్ఘకాలిక ప్లాన్స్ ఉన్న పెట్టుబడిదారులు మాత్రమే వెండిని కొనుగోలు చేయాలి.



































