లక్నో: లేడీ పోలీస్ సింగంగా పేరుగాంచిన ఐపీఎస్ అధికారిణిని (Shrestha Thakur) ఒక వ్యక్తి బురిడీ కొట్టించాడు. ఐఆర్‌ఎస్ అధికారిగా నమ్మించి ఆమెను పెళ్లాడాడు.
మోసపోయినట్లు గ్రహించిన ఆ పోలీస్ అధికారిణి చివరకు అతడికి విడాకులు ఇచ్చింది. అయితే ఆమె పేరుతో మోసాలు చేస్తుండటంతో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. 2012 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణి అయిన శ్రేష్ఠా ఠాకూర్, నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించడంతో ‘లేడీ సింగం’గా పేరుపొందింది. ప్రస్తుతం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా ఆమె విధులు నిర్వహిస్తున్నది.
కాగా, 2018లో మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా రోహిత్ రాజ్ అనే వ్యక్తి శ్రేష్ఠకు పరిచయమయ్యాడు. రాంచీలో డిప్యూటీ కమిషనర్‌గా పని చేస్తున్న 2008 బ్యాచ్ ఐఆర్‌ఎస్ అధికారినంటూ ఆమెను నమ్మించి పెళ్లాడాడు. అయితే పెళ్లి తర్వాత శ్రేష్ఠకు అసలు నిజం తెలిసింది. అసలైన ఐఆర్‌ఎస్ అధికారి రోహిత్ రాజ్ తన భర్త కాదని తెలిసి షాక్ అయ్యింది. తాను మోసపోయినట్లు గ్రహించింది. అయితే వివాహ బంధాన్ని తెంచుకోలేక రెండేళ్లు ఆ వ్యక్తితో కాపురం చేసింది.
మరోవైపు నకిలీ రోహిత్ రాజ్, తన పోలీస్ భార్య శ్రేష్ఠ పేరుతో పలు మోసాలకు పాల్పడ్డాడు. దీంతో విసిగిపోయిన ఆమె చివరకు అతడికి విడాకులు ఇచ్చింది. అయినప్పటికీ ఆ వ్యక్తి శ్రేష్ఠ పేరుతో జనాలను మోసగిస్తున్నాడు. ఈ విషయం తెలిసిన ఆమె ఘజియాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు చేసిన మోసాలపై దర్యాప్తు చేస్తున్నారు