Side Effects Of Eating Curd: రాత్రిపూట పెరుగు తింటున్నారా? అయితే, జాగ్రత్త..!

www.mannamweb.com


పెరుగు మన రోజువారీ జీవితంలో విడదీయరాని భాగం. వివిధ ప్రాంతాల్లో ప్రజలు వివిధ మార్గాల్లో పెరుగును ఆహారంలో భాగంగా చేసుకుంటారు. పెరుగులో శరీరానికి మేలు చేసే సూక్ష్మజీవులు, కాల్షియం, అనేక ఇతర పోషకాలు ఉన్నాయి.

ఇలా పెరుగు శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనాలను అందిస్తుంది. అయితే అదే పెరుగు మీకు సమస్యగా మారి మీ ఆరోగ్యాన్ని చెడగొడుతుందంటే నమ్మగలరా ? అవును.. పెరుగును సరైన సమయంలో తీసుకుంటే శరీరానికి మేలు చేస్తుందని, లేదంటే హాని కలిగించే అవకాశం కూడా ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. అంటే రాత్రిపూట మీ ఆహారంలో పెరుగును చేర్చుకోవడం వల్ల రకరకాల సమస్యలు వస్తాయి. రాత్రిపూట పెరుగు తినడం వల్ల కలిగే సమస్యలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

రాత్రిపూట పెరుగు తినడం వల్ల మీ నిద్రకు భంగం కలుగుతుంది. పెరుగులో ఉండే టైరమైన్ మీ మెదడును ఉత్తేజపరుస్తుంది. దీని కారణంగా త్వరగా నిద్రపట్టక ఇబ్బంది పడాల్సి వస్తుంది. నిద్రలేమి వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. రాత్రి పూట తినడం వల్ల శ్వాసకోశ సమస్యలు వస్తాయని చెబుతారు. రాత్రిపూట పెరుగు తినడం వల్ల గొంతులో కఫం ఏర్పడుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.

పెరుగు శరీరానికి ప్రొటీన్లను అందించే అద్భుతమైన ఆహారం. అయితే, ఇందులో కొవ్వు కూడా ఉంటుంది. రాత్రిపూట మీ శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది. శారీరక శ్రమ లేనప్పుడు దీన్ని తినడం వల్ల ఆ కొవ్వులు శరీరంలో నిల్వ ఉంటాయి. ఇలా బరువు తగ్గాలనుకునే వారు రాత్రిపూట పెరుగు తినకుండా ఉండాలి. మీరు దగ్గు లేదా జలుబుతో బాధపడుతుంటే రాత్రి వేళ పెరుగు అస్సలు తినకూడదు. రాత్రిపూట పెరుగు తీసుకుంటే చాలా మందికి జీర్ణ సమస్యలు వస్తుంటాయి. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. కడుపులో గ్యాస్ ఏర్పడవచ్చు. దీనికి ప్రధాన కారణం పెరుగులో ఉండే చక్కెర సమ్మేళనం అయిన లాక్టోస్‌ను కొంతమంది శరీరాలు అంగీకరించకపోవడమే. దీన్నే లాక్టోస్ ఇంటొలరెన్స్ అంటారు. ముఖ్యంగా వయసు పెరిగేకొద్దీ, మన శరీరం లాక్టేజ్ ఎంజైమ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది, ఇది లాక్టోస్ అసహనానికి దారితీస్తుంది.

కీళ్లనొప్పులతో బాధపడేవారు రోజూ పెరుగు తింటే మంచిది కాదు. రాత్రిపూట పెరుగు తినడం వల్ల కీళ్లలో దృఢత్వం, నొప్పులు పెరుగుతాయని చెబుతారు. అయితే ఇప్పటికే ఆర్థరైటిస్ ఉన్నవారు పెరుగును తినడం తగ్గించాలి. కాబట్టి రాత్రి భోజనంలో పెరుగు తినడం మానేయాంటున్నారు. పెరుగు ఉదయాన్నే తింటే మంచిది. రాత్రిపూట పెరుగు తినాలని ఉంటే..మజ్జిగ రూపంలో తీసుకోవటం మంచిది. కానీ, రాత్రిపూట చిక్కటి పెరుగు తినడం వల్ల పలు రకాల సమస్యలు వస్తాయి.