కామెర్లు.. సైలెంట్ కిల్లర్.. పచ్చ కామెర్లు అంటే.. చర్మం, కళ్లలోని తెల్లటి భాగం పసుపుపచ్చ రంగుకు మారడం.. ఈ ప్రమాదకరమైన వ్యాధి.. అప్పుడే పుట్టిన శిశువు నుంచి..
యువత.. వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి వస్తుంది.. అసలు కామెర్లు ఎందుకొస్తుందంటే.. రక్తంలో బిలిరుబిన్ (బిలిరుబిన్ అనేది ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నమైనప్పుడు ఏర్పడే ఒక పసుపు-రంగు పదార్థం) అనే పదార్థం అధికంగా పేరుకుపోవడం వలన ఈ సమస్య వస్తుంది. వైద్య నిపుణుల ప్రకారం.. కామెర్లు అనేది చర్మం – కళ్ళు పసుపు రంగులోకి మారే ఒక వైద్య పరిస్థితి. సాధారణంగా కామెర్లు కాలేయ సమస్యలు లేదా ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నం కావడం వల్ల వస్తుంది.
బిలిరుబిన్ కాలేయం ద్వారా ప్రాసెస్ చేయబడి, పిత్తంలోకి విడుదల అవుతుంది.. చివరకు ప్రేగుల ద్వారా బయటకు పంపబడుతుంది. రక్తంలో బిలిరుబిన్ స్థాయిలు పెరిగితే కామెర్లు రావడానికి కారణమవుతుందని వైద్యులు చెబుతున్నారు. బిలిరుబిన్ పరిమాణం ఎక్కువైనప్పుడు అది చుట్టుపక్కల కణజాలాలోకి చేరి వాటికి పసుపు రంగును కలిగిస్తుంది.
అయితే, ఈ బిలిరుబిన్ సమస్యను కాలేయం తగ్గిస్తుంది. కొన్ని సందర్భాల్లో మనం తీసుకునే ఆహార పదార్థాలు వలన కాలేయ పనితీరును దెబ్బతినేలా చేస్తాయి.. దీంతో పచ్చకామేర్ల వ్యాధి తీవ్రంగా మారుతుంది. చర్మం, కళ్లు పసుపు పచ్చగా మారడమే కాకుండా.. జ్వరం, అలసట, బలహీనంగా మారుతారు.. పచ్చ కామెర్ల వ్యాధి సోకినప్పుడు ఆ వ్యక్తి తీసుకునే ఆహారపదార్థాలలో జాగ్రత్తలు పాటించాలి.
బిలిరుబిన్ ఎంత ఉండాలి..
బిలిరుబిన్ 1.2 mg/100 ml వరకు సాధారణం.. అంతకన్నా ఎక్కువగా ఉంటే.. వైద్యులను సంప్రదించి జాగ్రత్తలు పాటించాలి.. ఎక్కువగా పెరిగితే.. శరీరంలో పలు లక్షణాలు కనిపిస్తాయి..
కామెర్ల లక్షణాలు:
చర్మం – కళ్ళు పసుపు రంగులోకి మారడం, మూత్రం ముదురు పసుపు రంగులోకి మారడం, మలం రంగు మారడం, అలసట, ఆకలి లేకపోవడం, దురద..
కామెర్ల కారణాలు:
కాలేయ వ్యాధులు (హెపటైటిస్, సిర్రోసిస్), ఎర్ర రక్త కణాల విచ్ఛిన్నం, పిత్తాశయంలో రాళ్ళు, కొన్ని రకాల మందులు, కొన్ని జన్యుపరమైన లోపాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మీకు కామెర్ల లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం..
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఆల్కహాల్ తాగడం మానేయడం, సురక్షితమైన లైంగిక సంబంధాలు పాటించడం, కాలేయం దెబ్బతినే అవకాశం ఉన్న మందులు వాడకపోవడం.. మీరు ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లయితే, వైద్యుడిని సంప్రదించి చికత్స పొందడం మంచిది.
































