ఇకపై సిల్వర్‌ రీసైక్లింగ్‌

ఎంఎంటీసీ-పీఏఎంపీ వెండి రీసైక్లింగ్‌ (పునర్‌వినియోగానికి అనుకూలంగా మార్చే) వ్యాపారంలోకి అడుగుపెట్టే ప్రణాళికతో ఉన్నట్టు ప్రకటించింది. పెరుగుతున్న డిమాండ్‌ సరఫరాపరంగా తీవ్ర కొరతకు దారితీసే పరిస్థితులు ఉన్నందున వచ్చే మూడు నెలల్లో తన స్టోర్లలో ప్రయోగాత్మకంగా వెండి రీసైక్లింగ్‌ను మొదలుపెట్టనున్నట్టు సంస్థ ఎండీ, సీఈవో సమిత్‌ గుహ తెలిపారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిమాండ్‌ పెరుగుతున్నప్పటికీ అంతర్జాతీయంగా సరఫరా పెరిగే పరిస్థితుల్లేవని, ఈ క్రమంలో రీసైక్లింగ్‌ వ్యాపారం అనుకూలంగా ఉన్నట్టు చెప్పారు. ఇదే డిమాండ్‌ ఇక ముందూ కొనసాగితే అప్పుడు శుద్ధి చేసిన వెండి కీలకపాత్ర పోషిస్తుందన్నారు. భారతీయుల వద్ద 25,000 టన్నుల బంగారం, ఇంతకు పది రెట్లు వెండి ఉన్నందున రీసైక్లింగ్‌ను ప్రభుత్వం ప్రోత్సహించాలని అభిప్రాయపడ్డారు. ఎంఎంటీసీ-పీఏఎంపీ బంగారం రీసైక్లింగ్‌కు 20 స్టోర్లను నిర్వహిస్తోందని, వీటిని వెండి రీసైక్లింగ్‌కు వీలుగా కొన్ని మార్పులు చేస్తే సరిపోతుందన్నారు.

వచ్చే ఐదేళ్లలో స్టోర్ల సంఖ్యను రెట్టింపు చేసుకోనున్నట్టు తెలిపారు. రీసైక్లింగ్‌కు అదనంగా.. దక్షిణ, తూర్పు భారత్‌లో మింటింగ్‌ వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటున్నట్టు సమిత్‌ గుహ చెప్పారు. మింటింగ్‌ సామర్థ్యాన్ని 2.4 మిలియన్‌ కాయిన్ల నుంచి 3.6 మిలియన్ల కాయిన్లకు పెంచుకోనున్నట్టు ప్రకటించారు. తన పోర్టల్‌తోపాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ తదితర ప్లాట్‌ఫామ్‌లపై బంగారం, వెండి కాయిన్ల విక్రయాలను పెంచుకోనున్నట్టు తెలిపారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.