ఈ రోజుల్లో చాలా మంది డ్యుయల్ సిమ్ వాడడం సర్వసాధారణం. ఒక సిమ్ వ్యక్తిగత లేదా కుటుంబ అవసరాల కోసం, మరొక సిమ్ బిజినెస్, ఇతర పనుల కోసం ఉపయోగిస్తుంటారు.
కొంత మంది మూడు లేదా నాలుగు సిమ్‌లు వాడుతున్నారు. చాలా మంది తమ వ్యక్తిగత సిమ్ లేదా అత్యవసర పరిస్థితుల్లో ఉంచిన సిమ్‌ని రీఛార్జ్ చేయడం మర్చిపోతారు. ప్రస్తుతం మొబైల్ రీఛార్జ్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కానీ, ఇలా రీచార్జ్ చేయకుండా సిమ్ వదిలేస్తే కంపెనీ బ్లాక్ చేస్తుంది. ఆ తర్వాత ఆ నంబర్ వేరొకరికి కేటాయిస్తుంది.
టెలికాం నిబంధనల ప్రకారం.. నిర్దిష్ట వ్యవధిలోపు సిమ్ రీఛార్జ్ చేయకపోతే ఆ నంబర్ మరొక వ్యక్తికి కేటాయిస్తారు. చాలా మంది తమ మొబైల్ నంబర్‌ను ఇలా పోగొట్టుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే, కొంతమందికి ఆ నంబర్ ప్రత్యేకమైనది లేదా ముఖ్యమైన పని కోసం ఉపయోగిస్తుంటారు. ఆ నంబర్ చాలా మంది వద్ద ఉండటంతో వేరే నంబర్ మారిస్తే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో కూడా ఒక వేళ సిమ్ కార్డుపోయినా, మొబైల్ పోయినా ఆ నంబర్‌పైనే మరో సిమ్‌ను పొందుతుంటారు. కొందరేమో సిమ్‌కార్డు పోయినా పట్టించుకోరు. వేరే కొత్త నంబర్‌ను తీసుకుంటారు. అలాగే కొందరేమో ఒకటి కంటే ఎక్కువ సిమ్ కార్డును వాడుతూ అందులో కొన్నిటికి రీఛార్జ్ చేయరు. అలాగే ఉంచేస్తుంటారు. మీరు మీ సిమ్‌ని రీఛార్జ్ చేయకపోతే కంపెనీ ఎన్ని రోజులు ఆ నంబర్‌ను మరొకరికి ఇస్తుందో చూద్దాం.
మీరు మీ సిమ్‌ని రీఛార్జ్ చేయకుంటే ఆ సిమ్ నంబర్‌ను వేరొకరికి బదిలీ చేయడానికి ముందు కంపెనీలు అనేక ముఖ్యమైన పనులను చేస్తాయి. ముందుగా మీరు 60 రోజుల పాటు సిమ్‌ని రీఛార్జ్ చేయనప్పుడు అది డియాక్టివేట్ చేస్తుంది. దీని తరువాత, రీఛార్జ్ చేయడానికి 6 నుండి 9 నెలల వ్యవధి ఇస్తుంది. ఈ సందర్భంలో మీరు నంబర్‌ను రీఛార్జ్ చేయవచ్చు. దాన్ని మళ్లీ యాక్టివ్ చేసుకోవచ్చు.
ఆ తర్వాత కూడా మీరు సిమ్‌ని ఉపయోగించకపోతే, కంపెనీ అనేక హెచ్చరికలు జారీ చేస్తుంది. చివరగా కంపెనీ సిమ్ బ్లాకింగ్ ప్రక్రియను ప్రారంభిస్తుంది. కొన్ని నెలల తర్వాత ఈ సిమ్ నంబర్ మరొక వినియోగదారుకు బదిలీ చేస్తుంది. ఈ ప్రక్రియ దాదాపు ఒక సంవత్సరం పడుతుంది. అంటే ఒకరి నుంచి మరొకరికి సిమ్‌ని బదిలీ చేయడానికి ఏడాది సమయం పడుతుంది.