అమరావతి: ‘ఇప్పుడొచ్చిన ఫలితాలు శకుని పాచికల్లాంటివి.. వారికి కావాల్సినట్లుగా పడ్డాయి. ఇది ఇంటర్వెల్ మాత్రమే’ అని వైకాపా అధ్యక్షుడు జగన్ వ్యాఖ్యానించారు. ‘తలదించుకునే రాజకీయాలు ఎప్పుడూ చేయలేదు. ఎప్పటికైనా ధర్మం, నిజమే గెలుస్తాయి. 2029 ఎన్నికల్లో చంద్రబాబుకు సింగిల్ డిజిట్లోనే సీట్లు వస్తాయి’ అని పేర్కొన్నారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో వైకాపా విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులతో మాట్లాడారు.
ప్రజలపై కోప్పడాల్సిన పని లేదు
‘ప్రజలపై మనం కోప్పడాల్సిన అవసరం లేదు.. ఒక్కోసారి మోసపోతారు. అలా మోసపోయిన వారందరికీ మనం అండగా ఉన్నామనే భరోసానివ్వాలి. చంద్రబాబు ప్రలోభాలకు ప్రజలు మోసపోవడం వల్లే మనకు అపజయం కలిగింది. ఆ మోసాలు తేటతెల్లమవగానే ప్రజల్లో మన పట్ల ప్రేమ, ఆయన పట్ల కోపం మొదలవుతాయి. మనల్ని గొప్ప మెజారిటీలతో గెలిపిస్తారు. మీరంతా ఓడిపోయామనే భావన మనసులోంచి తీసేయండి. మనం చేసిన మంచి ప్రతి ఇంట్లో ఉంది. చెప్పిన పనులు చేశాం కాబట్టి తలెత్తుకుని మనం ప్రతి ఇంటికీ వెళ్లగలం’ అన్నారు. ‘మనకు వచ్చిన సంఖ్యాబలం చాలా తక్కువే కాబట్టి, అసెంబ్లీలో మనం ఏదో చేయగలమని నాకైతే నమ్మకం లేదు.
ప్రజల కోసం పోరాటాలను వేగవంతం చేద్దాం. మన కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి. వాళ్లకు అండగా నిలవండి. మన కోసం నిలబడ్డారు, జెండాలు మోసి నష్టపోయారు, ఓట్లు వేసి దెబ్బలు తిన్నారు. మీ నియోజకవర్గంలో ఎక్కడ ఎవరికి నష్టం జరిగినా వెళ్లండి, మీ తరఫు నుంచి సాయం చేయండి. పార్టీ నుంచి ఇచ్చే సాయాన్నీ అందించండి. ప్రతీ కార్యకర్తకు తోడుగా ఉండి, భరోసా ఇద్దాం’ అని నేతలకు చెప్పారు.